టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో(MS Dhoni) తనకున్న అనుబంధాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ(Virat Kohli) చెప్పాడు. మహీ అంటే తనకెంతో గౌరవమని తెలిపాడు. శనివారం ఇన్స్టాలో అభిమానులతో ముచ్చటించిన విరాట్.. పలు విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. 'ధోనీతో ఉన్న అనుబంధాన్ని రెండు పదాల్లో చెప్పాలని అడగ్గా.. 'నమ్మకం', 'గౌరవం' అని బదులిచ్చాడు.
గతంలోనూ పలుసార్లు మహీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు కోహ్లీ. తాను జాతీయ జట్టు సారథి కావడంలో మహీ కీలక పాత్ర పోషించాడని అన్నాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని చెప్పాడు.
సర్ క్వారంటైన్లో మీ దినచర్య ఎలా ఉంటుందో చెప్పండి..
కోహ్లీ: రోజుకు ఒకసారి ట్రెయినింగ్ చేయడం మిగతా సమయం కుటుంబంతో గడపడం.
వామికా అంటే అర్థమేంటి? తను ఎలా ఉంది.. తన ఫొటోలు చూడొచ్చా?
కోహ్లీ: దుర్గా దేవికి మరో పేరే వామికా. తనకు సామాజిక మాధ్యమాలంటే ఏంటో తెలిసొచ్చేదాకా వాటికి దూరంగా ఉంచాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత తన ఇష్టప్రకారం ఉండొచ్చు.
మీ డైట్లో ఏముంటాయ్?
కోహ్లీ: కూరగాయలు, గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, పాలకూర ఇవన్నీ తింటా కానీ తగిన మోతాదులోనే.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కోహ్లీ: ముఖ్యమైన వాటి గురించే ఆలోచించండి. అలాగే అంతా మంచే జరుగుతుందనే అనుకోండి. ఎప్పుడైనా అది జరగొచ్చనే అభిప్రాయంతో ఉండండి.
గూగుల్లో మీరు చివరిసారి దేని గురించి వెతికారు?
కోహ్లీ: క్రిస్టియానో రొనాల్డో గురించి చూశా.
మీ గతానికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని మార్చుకోవాల్సి వస్తే ఏం చేస్తారు?
కోహ్లీ: అలాంటిదేం లేదు..
ఆర్సీబీ లేదా టీమ్ఇండియాలో సరదాగా, ఆకట్టుకునేలా, బాగా సిగ్గుపడే ఆటగాళ్ల పేర్లు చెప్పండి..
కోహ్లీ: సరదాగా అంటే చాహల్, ఆకట్టుకునే ఆటగాడు డివిలియర్స్, బాగా సిగ్గుపడే ఆటగాడు కైల్ జేమీసన్
టీమ్ఇండియా గురించి మీరు పంచుకునే ఒక సీక్రెట్ ఏమిటి?
కోహ్లీ: మేమంతా ప్రాంక్స్టర్స్ బృందం.
మీకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఎలా స్ఫూర్తిపొందుతారు?
కోహ్లీ: మనం చేసే పనులు సరిగ్గా చేయాలి. ఫలితం గురించి ఆలోచించకుండా వాటికి కట్టుబడి ఉండాలి.
రోజూ మీరు ఏమేం తింటారు?
కోహ్లీ: చాలా వరకు ఇంట్లో చేసే భారతీయ ఆహారమే తింటాను. అప్పుడప్పుడూ చైనీస్ ఫుడ్ కూడా తీసుకుంటా. అవికాకుండా ఆల్మండ్స్, ప్రొటీన్ బార్, పండ్లు తింటాను.