Kohli Vs Srilanka Malinga: లక్ష్యం ఎంత పెద్దదైనా, ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతడివాడైనా.. తగ్గేదే లే అంటూ ఆడటం రమ్ మెషీన్ టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రత్యేకత. ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం. అయితే కోహ్లీ సాధించిన ఘనతల్లో ఓ మరుపురాని ఇన్నింగ్స్.. నేటితో(ఫిబ్రవరి 28) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఓ సారి ఆ ఇన్నింగ్స్‌ను నెమరువేసుకుందాం..
కోహ్లీ తుపాన్ ఇన్నింగ్స్
2012 కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీ(133*) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లోనే మేటి ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఓ పీడకలలా మారాడు. దాన్ని ఇప్పటికీ అభిమానులు కూడా మరిచిపోలేరు.
ఆ టోర్నీలో టీమ్‌ఇండియా ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. అలాంటి పరిస్థితుల్లో ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 40 ఓవర్లనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. అది దాదాపు అసాధ్యమనే అంతా భావించారు. అయితే టీమ్‌ఇండియాకు ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్ (30), సచిన్ తెందూల్కర్ (39) శుభారంభం చేశారు. 6 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన గంభీర్ (63), కోహ్లీ (133*) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక గేర్ మార్చాల్సిన సమయంలో గంభీర్ రనౌటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 27.3 ఓవర్లలో 201/3గా నమోదైంది. కోహ్లీ (61) పరుగులతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా గెలవాలంటే చివరి 12 ఓవర్లలో 120 పరుగులు అవసరం.