అనుకున్నట్లే జరిగింది. టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
"భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నా. సారథిగా నా జర్నీలో అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, కోచ్‌లు, ప్రతి భారతీయుడి ప్రార్థనలతోనే ఇదంతా సాధించా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లకు ఆడుతున్నా. ఐదారేళ్లుగా 3 ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. పని ఒత్తిడి కారణంగా ఇప్పుడు తప్పుకొంటున్నా. టెస్టు, వన్డేలలో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు ఇది దోహదపడుతుంది. టీ20 కెప్టెన్‌గా నా కెరీర్లో జట్టుకు కావాల్సిన ప్రతిదీ చేశా. టీ20 బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవిభాయ్, రోహిత్‌తో ఎన్నో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా, సెలక్టర్లతో మాట్లాడాను. నా వంతుగా జట్టుకు అత్యుత్తమ సేవలందిస్తా."