ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో(Wold Test Championship) టీమ్‌ఇండియా ఆచితూచి ఆడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నాడు. నియంత్రిత దూకుడు మాత్రమే అవసరమని సూచించాడు. ఇంగ్లాండ్‌లో వాతావరణం నిమిషాల వ్యవధిలో మారుతుందన్నాడు. అందుకే ఒక్కో సెషన్ లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపాడు. వ్యూహాత్మకంగా, సాంకేతికంగా మెరుగ్గా ఆడాలని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌లో(rishab Pant) పరిణతి కనిపిస్తోందని వెల్లడించాడు.
"టీమ్‌ఇండియా(Team india) బ్యాటింగ్ విభాగం అద్భుతంగా ఉంది. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం. నా వరకైతే కోహ్లీసేన బ్యాటింగే అతి ముఖ్యమైంది. ఈ మధ్య కాలంలో బౌలర్లు తిరుగులేని విధంగా ఆడుతున్నారు. అందుకే బ్యాట్స్‌మెన్ నాణ్యతను బట్టే ఫైనల్‌లో గెలుపోటములు ఉంటాయి. టెస్టు క్రికెట్ అంటేనే సెషన్లు. ఇంగ్లాండ్‌లో నిమిషాల్లోనే ఎండలు కాస్తున్న ఆకాశం మేఘావృతం అవుతుంది. అందుకే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బాగా ఆడాలి."