Virat Kohli 71st Century: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రోటీస్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా శతకం నమోదు చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని కోహ్లీ.. ఈ సిరీస్‌లో శతక లోటును భర్తీ చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.
"కేప్‌టౌన్, న్యూలాండ్స్ పిచ్‌లంటే కోహ్లీకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ప్రస్తుత మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ కచ్చితంగా సెంచరీ బాదుతాడు. భారత జట్టులో అనుభవమున్న ఆటగాళ్లున్నారు. తొలి రెండు వన్డేలు జరగనున్న పార్ల్‌లోని బోలాండ్ పార్క్ పిచ్ భారత జట్టుకి కలిసి వస్తుందనుకుంటున్నాను. వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంటుంది" అని మోర్కెల్ అంచనా వేశాడు.
భారత అభిమానులు కూడా కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదిలేసి భారం దించుకున్న కోహ్లీ.. ఈ సారైనా అభిమానుల కోరిక నెరవేరుస్తాడేమో చూడాలి. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో సొంతం చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఎలాగైనా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది.
మరో రికార్డుకు చేరువలో..