Virat Kohli 50th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డే కెరీర్లో 50వ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ (49) రికార్డు బద్దలుకొట్టాడు. 2023 వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు మాజీలు, సెలెబ్రిటీలు అతడిని అభినందిస్తున్నారు.
తన కెరీర్లో అద్భుతమైన మైలురాయి అందుకున్న క్రమంలో విరాట్‌ను సచిన్ అభినందించాడు. "ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారి నువ్వు తొలిసారి కలిసినప్పుడు.. నా పాదాలను తాకుతుంటే సహచర ఆటగాళ్లు నిన్ను ఆట పట్టించారు. ఆరోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ, ఈరోజు నీ నైపుణ్యాలతో నా గుండెను తాకావు. ఆనాటి కుర్రాడు.. నేడు 'విరాట్'గా మారినందుకు ఎంతో సంతోషిస్తున్నా' అని సచిన్ ట్వీట్ చేశాడు.
'దేశం గర్విస్తోంది'..
విరాట్ సెంచరీపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. "ఈ 50వ సెంచరీ విరాట్ క్రీడాస్ఫూర్తి, పట్టుదల, ప్రతిభకు నిదర్శనం. ఈ సందర్భంగా విరాట్‌కు.. హృదయపూర్వక శుభాకాంక్షలు. నువ్వు ఇలాగే భావి తరాలకు బెంచ్‌మార్క్ క్రియేట్ చెయ్యాలని కోరుకుంటున్నా' అని అన్నారు. అలాగే "వన్డేల్లో 50వ సెంచరీ అందుకున్న విరాట్‌కు నా ప్రత్యేక అభినందనలు. ఈ సెంచరీ నీ క్రీడాస్ఫూర్తికి, నిలకడ ఆటతీరుకు నిరర్శనం. దేశం నిన్ను చూసి గర్విస్తోంది" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.