Virat Kohli 100 Test: శుక్రవారం 100వ టెస్టు మైలురాయిని అందుకోనున్నాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఆ ఘనత దక్కించుకోనున్నాడు. భారత్ తరఫున 100 టెస్టులాడిన 12వ ప్లేయర్‌గా నిలవనున్నాడు.
2011 జూన్‌లో వెస్టిండీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు విరాట్. తొలి టెస్టు సెంచరీని 2012 జనవరిలో ఆస్ట్రేలియాపై సాధించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 99 మ్యాచ్‌ల్లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలు, 28 అర్ధ శతకాలున్నాయి. అత్యధిక స్కోరు 254*.
కెప్టెన్సీ ఇలా..
2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ గాయపడటం వల్ల తొలి టెస్టుకు సారథ్యం వహించాడు కోహ్లీ. ఆ మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో విరాట్ అదరగొట్టేశాడు. సారథిగానూ మెప్పించాడు. దీంతో ఆ సిరీస్ నాలుగో టెస్టుకు ముందే ధోని తప్పుకొని కెప్టెన్సీ బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు. ఈ క్రమంలోనే 40 టెస్టు విజయాలతో చరిత్రలో అత్యంత విజయవంతమైన నాలుగో కెప్టెన్ స్థాయికి ఎదిగాడు విరాట్. దాంతో పాటే ఎన్నో రికార్డులు సాధించాడు. వాటిల్లో టాప్-7పై ఓ లుక్కేయండి..
విరాట్ టాప్-7 రికార్డులు..
- టెస్టుల్లో కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక స్కోరు (254*) సాధించింది కోహ్లీనే. ఆ తర్వాతి రెండు అత్యధిక స్కోర్లు (243, 235) కూడా అతడివే కావడం విశేషం. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత మాజీ సారథి ఎంఎస్ ధోనీ (224) ఉన్నాడు.
- ఒక సిరీస్‌లో అత్యధిక శతకాలు (4) బాదిన భారత క్రికెటర్లలో దిగ్గజం సునీల్ గావస్కర్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ. 2014/2015లో ఆస్ట్రేలియా పర్యటనలో 4 సెంచరీలతో కలిపి 692 పరుగులు చేశాడు విరాట్. గావస్కర్.. ఈ ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. అయితే అందులో ఒకటి 7మ్యాచ్‌లు, మరొకటి 6 మ్యాచ్‌ల సిరీస్ కాగా, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోనే కోహ్లీ.. నాలుగు సెంచరీలు చేయడం విశేషం.
- సారథ్యం వహించిన 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన టీమ్ఇండియా కెప్టెన్‌గా నిలిచాడు కోహ్లీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విజయవంతమైన కెప్టెన్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు . గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) అతడికంటే ముందున్నారు.
- భారత్ తరఫున అత్యధిక శతకాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు కోహ్లీ (27). సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) అతడికన్నా ముందున్నారు.
- కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలురాయి చేరుకున్నది కోహ్లీనే. 86 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్కునూ అందుకుంది అతడే.
- భారత్ తరపున అత్యధిక ద్విశతకాలు సాధించాడు విరాట్ కోహ్లీ (7). ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ క్రికెటర్ వాలీ హామండ్ (7), శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే (7)తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
- టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక ద్విశతకాలు సాధించింది కూడా కోహ్లీనే (7). అతడి డబుల్స్ అన్నీ సారథిగా ఉన్నప్పుడు చేసినవే. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (5) అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ (25) తర్వాత అత్యధిక శతకాలు కోహ్లీవే (20).
విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెరీర్..
వన్డేల్లో-260 మ్యాచ్‌లు ఆడిన రన్‌మెషీన్.. 58.07 సగటుతో 12,311 పరుగులు చేశాడు. 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 183*.
టీ20ల్లో-97 మ్యాచ్‌ల్లో 51.50 సగటుతో 3,296 పరుగులు చేశాడు విరాట్. 30 అర్ధ శతకాలు చేసిన అతడు.. ఈ ఫార్మాట్లో సెంచరీ చేయలేకపోయాడు. అత్యధిక స్కోరు 94.
విరాట్ టెస్టు సెంచరీలు..
- టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 7 సెంచరీలు బాదాడు
- ఇంగ్లాండ్‌పై అత్యధికంగా 1960 పరుగులు చేశాడు
- విరాట్ తన చివరి శతకాన్ని 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టులో సాధించాడు. అతడు అంతర్జాతీయ కెరీర్లో మరో సెంచరీ చేయక 28నెలలు దాటింది. ఈ నేపథ్యంలోనే తన 100వ టెస్టులోనైనా శతకం బాదాలని అభిమానులు కోరుకుంటున్నారు.