Virat Kohli 100 test: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తాడోనని యావత్ క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన వందో టెస్టులోనైనా సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకూ కోహ్లీ ఒక్క సెంచరీ చేయలేదు. తరచుగా అర్ధశతకాలతో రాణిస్తున్నా.. మూడంకెల స్కోరును మాత్రం అందుకోలేదు. ఈ నేపథ్యంలో మార్చి 4 నుంచి మెుహాలీలో జరిగే తన వందో టెస్ట్ మ్యాచ్ కోసం కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
కోహ్లీ సెంచరీ అంశంపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ సైతం స్పందించాడు. తన వందో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. వందో టెస్టులో సెంచరీ చేసిన మెుదటి భారతీయ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాలన్నాడు. దేశం తరఫున ఆడాలన్న కలతో ఎదిగి వందోటెస్ట్ మ్యాచ్ ఆడటం గొప్ప అనుభూతి అన్నాడు.
కోహ్లీ ఈ మ్యాచ్ ఆడితే భారత్ తరఫున వంద టెస్టు మ్యాచులాడిన పదకొండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇంతకుముందు సచిన్ తెందూల్కర్(200), రాహుల్ ద్రవిడ్(163), వీవీఎస్ లక్ష్మణ్(134), అనిల్ కుంబ్లే(132), దిలీప్ వెంగ్‌సర్కార్(116), సౌరభ్ గంగూలీ(113), ఇషాంత్ శర్మ(105), హర్బజన్ సింగ్(105), వీరేంద్ర సెహ్వాగ్(103) ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకూ ఏ భారత బ్యాటర్ కూడా వందో టెస్టులో సెంచరీ చేయలేదు. అంతర్జాతీయంగా చూస్తే 9 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు.
"సెంచరీ చేసి తన వందో టెస్ట్ మ్యాచ్‌ను కోహ్లీ ఘనంగా జరుపుకుంటాడని అనుకుంటున్నాను. అనేక మంది ఆటగాళ్లు వందో టెస్ట్ ఆడినా చాలా తక్కువ మంది ఈ ఘనతను సాధించారు. నాకు తెలిసి కొలిన్ కౌడ్రె మెుదటి ఆటగాడు అనుకుంటా. జావీద్ మియాందాద్, అలెక్స్ స్టీవార్ట్ కూడా చేశారు. నా 109వ టెస్ట్ మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను. నువ్వు ఈ ఘనత సాధించబోతున్నావని అనిపిస్తుంది. నువ్వు స్కూల్లో క్రికెట్ ఆడుతున్నపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నావు. దేశానికి ఆడుతూ వందో టెస్ట్ మ్యాచ్ వరకూ చేరుకున్నావు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఒక్క టెస్ట్ ఫార్మాట్లోనే కాదు మిగిలిన ఫార్మాట్లలో అతడు సాధించిన రికార్డులు చూస్తే అద్భతమైన ఆటగాడని ఎవరికైనా తెలుస్తుంది."