తెలంగాణ

telangana

ETV Bharat / sports

Vijay Hazare Trophy Final: మరో టైటిల్​పై తమిళనాడు కన్ను - తమిళనాడు వర్సెస్ హిమాచల్ లైవ్ న్యూస్

Vijay Hazare Trophy Final: ఆదివారం జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ పోరులో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ ఏడాది జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఛాంపియన్‌గా నిలిచిన తమిళనాడు మరో టైటిల్​పై కన్నేసింది. ఇక తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలని హిమాచల్ ఎదురుచూస్తోంది.

vijay hazare trophy final, tamilnadu vs himachal, విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్, తమిళనాడు వర్సెస్ హిమాచల్
vijay hazare trophy

By

Published : Dec 26, 2021, 6:44 AM IST

Vijay Hazare Trophy Final: ఈ సీజన్‌ దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఛాంపియన్‌గా నిలిచిన తమిళనాడు.. ఇప్పుడు మరో టైటిల్‌పై కన్నేసింది. విజయ్‌ హజారే వన్డే ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌తో ఫైనల్‌కు సిద్ధమైంది.

అన్ని విభాగాల్లో బలంగా..

Vijay Hazare Trophy Tamilnadu: అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న తమిళనాడు తుదిపోరులో ఫేవరేట్‌గా బరిలో దిగుతుంది. సెమీస్‌లో చివరి బంతికి సౌరాష్ట్రపై ఉత్కంఠభరిత విజయం సాధించిన ఆ జట్టు.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటుతోంది. కవల సోదరులు బాబా అపరాజిత్‌, బాబా ఇంద్రజిత్‌తో పాటు జగదీశన్‌, కెప్టెన్‌ విజయ్‌ శంకర్‌, సీనియర్‌ దినేశ్‌ కార్తీక్‌, ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌తో కూడిన ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగం ప్రత్యర్థి బౌలర్లకు సవాలు విసిరేదే. కీలకమైన సెమీస్‌లో అపరాజిత్‌ శతకం కొట్టగా.. ఇంద్రజిత్‌ అర్ధ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో 70 పరుగులతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. మరో ఇద్దరు స్పిన్నర్లు సాయి కిశోర్‌, సిద్ధార్థ్‌ కూడా జోరుమీదున్నారు. ఇక తన మీడియం పేస్‌తో మెరుస్తున్న కెప్టెన్‌ విజయ్‌తో సహా పేసర్లు సందీప్‌ వారియర్‌, సిలాంబరసన్‌ ఫామ్‌లో ఉన్నారు.

తొలి ట్రోఫీ కోసం..

కాగా, తొలిసారి విజయ్‌ హజారే ట్రోఫీ దక్కించుకోవాలనే ధ్యేయంతో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ టైటిల్‌ పోరులో తెగించి పోరాడేందుకు సై అంటోంది. ఆ జట్టు కెప్టెన్‌ రిషి ధావన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణిస్తూ జట్టును నడిపిస్తున్నాడు. సెమీస్‌లో సర్వీసెస్‌పై విజయంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఓపెనర్‌ ప్రశాంత్‌ చోప్రా ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే శుభమ్‌, దిగ్విజయ్‌, అమిత్‌, ఆకాశ్‌ కూడా బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో సిద్ధార్థ్‌, ఆకాశ్‌ కీలకం కానున్నారు.

ఇవీ చూడండి: IND vs SA test: టీమ్​ఇండియా కల.. ఈసారైనా నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details