ప్రతిష్ఠాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర గెలుపొందింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 249 పరుగుల భారీ లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే ఛేదించింది. కాగా మహరాష్ట్ర సారథి రుతురాజ్ గైక్వాడ్ చేసిన శతకం వృథా అయ్యింది. ఇక సౌరాష్ట్ర ప్లేయర్ షెల్డన్ జాక్సన్ ఒంటరి పోరాటం చేశాడు. జాక్సన్ 133 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. హార్వక్ దేశాయి(50) రాణించాడు. చిరాగ్ జాని(30) ఫర్వాలేదనిపించాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహరాష్ట్ర.. నిర్ణీత 50 ఓవర్లలో 248 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు బచావ్(27), అజిమ్ కాజి(37), సౌషద్(31) ఫర్వాలేదనిపించారు.
సౌరాష్ట్ర సంబరాలు..
మ్యాచ్ గెలిచిన తర్వాత సౌరాష్ట్ర జట్టు ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ఆ జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్.. గ్రౌండ్‌ను ముద్దాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పటివరకూ సౌరాష్ట్ర జట్టు రెండుసార్లు విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకుంది.