Vijay Hazare Trophy 2021 Winner: దేశవాళీ క్రికెట్లో ఈ సీజన్‌ను విజయంతో ముగించింది హిమాచల్ ప్రదేశ్. తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ దక్కించుకుంది. జైపుర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో తమిళనాడు జట్టుపై 11 పరుగులు తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. విజేడీ(VJD) పద్ధతిలో ఈ గెలుపును సొంతం చేసుకుంది.
ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 315 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47.3 ఓవర్‌కు నాలుగు వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది హిమాచల్. విజయానికి 15 బంతుల్లో 16 పరుగులు అవసరమైన నేపథ్యంలో చీకటి పడటం వల్ల విజేడీ పద్ధతి ద్వారా హిమాచల్ గెలిచినట్లుగా ప్రకటించారు. శుభమ్ అరోరా(136*), అమిత్‌కుమార్(74) విజయంలో కీలకంగా వ్యవహరించారు. హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్(33) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ను ఆడాడు. తమిళనాడు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, మురుగన్ అశ్విన్, అపరాజిత్ తలో వికెట్ తీశారు.