భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా సాగిన క్రికెట్ ప్రస్థానానికి వచ్చే నెలలో ఆమె ముగింపు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో ఆడే మూడో వన్డే మ్యాచే ఆమె చివరిదిగా సమాచారం. దీంతో ఆ మ్యాచ్‌తో ఝులన్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
39 ఏళ్ల ఝులన్ గోస్వామి ఈ ఏడాది మార్చిలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె చివరి సారిగా కన్పించారు. ఆ తర్వాత జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా.. వచ్చే నెలలో జరగబోయే ఇంగ్లాండ్ సీరిస్‌కు బీసీసీఐ ఝులన్‌ను ఎంపిక చేసింది.
సెప్టెంబరు 18 నుంచి భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఝులన్‌ను ఎంపిక చేయడం గమనార్హం. అయితే ఝులన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్న నేపథ్యంలో వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతోనే ఆమెను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసినట్లు సమాచారం. మహిళా క్రికెట్‌కు రెండు దశాబ్దాల పాటు ఆమె అందించిన సేవలను గౌరవించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 24న లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఝులన్ 19ఏళ్ల వయసులోనే జట్టులోకి వచ్చింది. రెండు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్‌లో బౌలర్‌గా, కెప్టెన్‌గా తనకెదురులేదనిపించింది. వన్డేల్లో 250 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లూ ఈ దరిదాపున కూడా లేకపోవడం విశేషం. ఇక మొత్తం 12 టెస్టులు, 201 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఝులన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి తన కెరీర్‌లో అత్యధికంగా 352 వికెట్లు పడగొట్టింది. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా బౌలర్ ఈమే కావడం మరో ప్రత్యేకం. క్రికెట్‌లోకి రావాలనుకునే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఝులన్ జీవితంపై త్వరలోనే సినిమా కూడా రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ వెండితెరపై ఝులన్‌గా ఆమె నిజజీవితాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇదీ చూడండి: కోహ్లీ సెంచరీకి వెయ్యి రోజులు, ఆసియాకప్‌లోనైనా అందుకుంటాడా