టీమ్ ఇండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు వెంకటేశ్ ఆడుతున్నాడు. శుక్రవారం.. కోయంబత్తూర్ వేదికగా వెస్ట్‌జోన్-సెంట్రల్ జోన్ సెమీఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట జరిగింది. వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా.. వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా బంతిని సంధించాడు. అయితే ఆ బంతి గజా వద్దకు వెళ్లింది. అంతకుముందు బాల్‌ను సిక్స్‌గా మలచడంతో గజా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. దీంతో వెంటనే బంతిని వెంకటేశ్ మీదకు విసిరాడు. అది నేరుగా వెంకటేశ్ అయ్యర్ మెడకు తాకడంతో బాధతో మైదానంలోనే విలవిలాడిపోయాడు. వెంటనే ఫిజియో పరుగున వచ్చి అయ్యర్ పరీక్షించాడు. అయితే కాసేపటికి తేరుకొన్న వెంకటేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్స్‌ను కూడా మైదానంలోకి తీసుకొచ్చారు.
నొప్పిని భరిస్తూనే కష్టాల్లో ఉన్న తన జట్టు సెంట్రల్ జోన్ కోసం వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే 14 పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరాడు. అందులో రెండు ఫోర్లు, సిక్స్ ఉండటం గమనార్హం. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 257 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (67), పృథ్వీషా (60) అర్ధశతకాలు సాధించారు. సెంట్రల్ జోన్ కేవలం 128 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్ట్‌జోన్ 130/3 స్కోరుతో కొనసాగుతోంది. పృథ్వీ షా (104) సెంచరీ బాదేశాడు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ మొత్తం 259 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.