USA Under 19 Vs Argentina U19 Record : అండర్-19 పురుషుల ప్రపంచకప్‌లో అమెరికా క్వాలిఫయర్ టోర్నీలో సంచలనం నమోదైంది. అర్జెంటీనా అండర్-19 జట్టుపై అమెరికా యువ జట్టు.. 450 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టొరొంటో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అత్యంత భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
అయితే ఇప్పటివరకు, 2002లో ఆసీస్ అండర్-19 జట్టు.. కెన్యాపై చేసిన 430 పరుగులే.. అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో అండర్-19 వన్డే ఫార్మాట్‌లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్‌ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు బాదింది.
ఇదే అతిపెద్ద విజయం..
అమెరికా నిర్దేశించిన 516 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటినా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అయితే ఇప్పటివరకు ఉన్న అత్యంత భారీ తేడాతో ఓడిపోయిన రికార్డు 430 పరుగులుగా ఉంది. 2002లో ఆసీస్, కెన్యా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక దీనికి ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో అరుణాచల్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 435 పరుగులతో అతి భారీ విజయం సాధించింది.