ICC test championship ranking: ఒకే ఒక్క విజయం స్థానాలనే తారుమారు చేయగలదని ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక (53.33%) డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. భారీ ఓటమితో పాకిస్థాన్ (51.85%) ఏకంగా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. రెండో టెస్టుకు ముందు వరకు పాక్ మూడో స్థానంలో ఉండేది. టీమ్‌ఇండియా (52.08%) మాత్రం యథావిధిగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మొదటి, రెండు స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా (71.43), ఆస్ట్రేలియా (70) ఉన్నాయి. వచ్చే మార్చి లోపు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ -2 తుదిపోరులో తలపడతాయి. మొదటి డబ్ల్యూటీసీలో కివీస్ విజయం సాధించగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది.
వన్డేల్లో మూడో స్థానం సుస్థిరం: విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో థర్డ్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకొంది. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే వన్డే సిరీస్‌కు ముందే పాయింట్ల పట్టికలో భారత్ 108 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది. ఇప్పుడు క్లీన్‌స్వీప్ తర్వాత పాయింట్లను పెంచుకొంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఖాతాలో110 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ (128), ఇంగ్లాండ్ (119) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ (106), ఆస్ట్రేలియా (101) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులతో కొనసాగుతున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ (270) అగ్రస్థానం కాగా.. టెస్టుల్లో (114) రెండో ర్యాంక్‌తో ఉంది.