తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDvsENG: రూట్ సెంచరీల జోరు.. రికార్డుల హోరు!

టీమ్ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో పరుగుల వరద పారిస్తున్నాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు పలు రికార్డులు నమోదు చేశాడు. అవేంటో చూద్దాం.

Root
రూట్

By

Published : Aug 27, 2021, 4:58 PM IST

భారత్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో అదిరిపోయే ఫామ్ కనబరుస్తున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. వరుస సెంచరీలు బాదుతూ భారత బౌలర్లకు సవాల్ విసురుతున్నాడు. లీడ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లోనూ శతకం (121) బాదాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు. అవేంటో చూద్దాం.

  • టెస్టు క్రికెట్​లో మొత్తంగా 23 సెంచరీలు చేశాడు రూట్. 33 శతకాలు చేసిన అలిస్టర్ కుక్ ఇంగ్లాండ్ తరఫున టెస్టు సెంచరీల్లో​ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్​ (23) కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు రూట్.
  • రూట్ బాదిన 23 సెంచరీల్లో 12 కెప్టెన్​గా సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు మాజీ కెప్టెన్ కుక్​తో సమానంగా నిలిచాడు.
  • 2021లో ఇప్పటివరకు 6 సెంచరీలు బాదాడు రూట్. ఫలితంగా ఓ క్యాలెండర్ ఇయర్​లో ఆరు సెంచరీలు చేసిన మూడో ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్​గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు డెనిస్ కాంప్టన్ (1947), మైకేల్ వాన్ (2002) ఈ ఘనత సాధించారు.
  • క్యాలెండర్ ఇయర్​లో 6 సెంచరీలు చేసిన కెప్టెన్​గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు రూట్. ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్​ 2006లో సారథిగా ఉండి 7 సెంచరీలు బాది అగ్రస్థానంలో ఉన్నాడు. 2021 కంటే ముందు ఏ ఇంగ్లాండ్ కెప్టెన్​ కూడా ఏడాదికి నాలుగుపైగా సెంచరీలు చేయకపోవడం గమనార్హం.
  • భారత్​పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్​మెన్ జాబితాలో గారీ సోబర్స్, వివి రిచర్డ్స్, పాంటింగ్, స్టీవ్ స్మిత్​తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు రూట్. వీరంతా టీమ్ఇండియాపై 8 టెస్టు సెంచరీలు చేశారు.
  • 2021 క్యాలెండర్ ఇయర్​లో ఇప్పటివరకు టెస్టుల్లో 1398 పరుగులు సాధించాడు రూట్. ఈ క్రమంలోనే కుక్​ (1364)ను అధిగమించి ఓ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ సారథుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్​గా మరో ముగ్గురు రూట్​ కంటే ముందున్నారు. వీరిలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్​ 1656 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
  • ఈ ఏడాది భారత్​పై 875 టెస్టు పరుగులు సాధించాడు రూట్. ఓ ప్రత్యర్థిపై అత్యధిక టెస్టు రన్స్ సాధించిన వారిలో ప్రస్తుతం రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడికంటే ముందు డాన్ బ్రాడ్​మన్ (974), క్లైవ్ లాయిడ్ (903) ఉన్నారు.
  • ఇక ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహ్మద్ యూసుఫ్‌ (1788) రికార్డును రూట్ అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుత సిరీస్‌తో పాటు ఈ ఏడాది యాషెస్‌తో కలిపి రూట్‌ కనీసం మరో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్​ల ద్వారా మరో 391 పరుగులు చేస్తే ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడీ ఇంగ్లాండ్ సారథి.

ఇవీ చూడండి: T20 Worldcup: 'భారత్​పై పాకిస్థాన్ గెలిచి తీరుతుంది'

ABOUT THE AUTHOR

...view details