ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా అప్పట్లో వాయిదా పడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, మ్యాచ్ డ్రాగా ముగిసినా సిరీస్ భారత్ వశమవుతుంది. ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ భారత టెస్టు జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. తద్వారా కపిల్‌దేవ్ సరసన జస్‌ప్రీత్ బుమ్రా నిలవనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా భారత టెస్టు జట్టుకు 36వ కెప్టెన్ కావడం గమనార్హం.
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు భారత్‌కు కీలక సవాలే. బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవడం.. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడటం.. కోహ్లీ, పూజారా ఫామ్ లేమి భారత బ్యాటింగ్ ఆర్డర్ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రోహిత్, కేెఎల్ రాహుల్ గైర్హాజరీలో శుభమన్ గిల్‌తో కలిసి ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. అసలైన పోరులోనూ సత్తా చాటాలని భారత్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్‌లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ భారత్‌కు అండగా ఉన్నారు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు.
ఆశలన్నీ బౌలర్లపైనే: టీమ్‌ఇండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్ దళంపైనే ఆధారపడ్డాయి. అప్పుడు భారత బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్, ఓవల్ మ్యాచ్‌లను సొంతం చేసుకుంది. ప్రధాన పేసర్లు.. జస్‌ప్రీత్ బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 18, మహ్మద్ సిరాజ్ 4 మ్యాచ్‌ల్లో 14, మహ్మద్ షమి 3 మ్యాచ్‌ల్లో 14, శార్దూల్ ఠాకూర్ 2 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.