తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన భారత జట్టు

under 19 world cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్​ జట్టు సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి సెమీస్​లో అడుగు పెట్టింది.

under 19 world cup india won the match against bangladesh
అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన భారత జట్టు

By

Published : Jan 30, 2022, 1:05 AM IST

Updated : Jan 30, 2022, 6:23 AM IST

under 19 world cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ సెమీస్‌లో అడుగు పెట్టింది. శనివారం క్వార్టర్‌ఫైనల్లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బంగ్లాను 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. లక్ష్యాన్ని 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యం చిన్నదే అయినా భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఓపెనర్‌ హర్నూర్‌ (0) డకౌటవడంతో ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ దశలో మరో ఓపెనర్‌ రఘువంశీ (44), ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ (26) నిలకడగా ఆడి జట్టును గెలుపు బాటలో నడిపించారు. ఒక దశలో 70/1తో భారత్‌ మంచి స్థితిలో నిలిచింది. అయితే రిపన్‌ మొండాల్‌ (4/31) విజృంభించడంతో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే లక్ష్యం చిన్నదే కావడం, కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (20 నాటౌట్‌), తంబె (11 నాటౌట్‌) నిలవడంతో భారత్‌ సులువుగానే విజయం సాధించింది. బుధవారం రెండో సెమీఫైనల్లో భారత్‌.. ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. మంగళవారం తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌ తలపడతాయి.

విజృంభించిన రవి

బంతి నెమ్మదిగా కదులుతున్న పిచ్‌పై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆరంభం నుంచే బంగ్లాదేశ్‌ను వణికించింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ రవికుమార్‌ (3/14) స్వింగ్‌తో విజృంభించడంతో బంగ్లా 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మఫిజుల్‌ (2), ఇఫ్తికార్‌ (1), నబిల్‌ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో బంగ్లా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో మరింత పట్టుబిగించిన భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు తీసింది. రవితో పాటు లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ విక్కీ (2/25) రాణించడంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఫ్లయిటెడ్‌ బంతులతో ప్రత్యర్థికి పరీక్ష పెట్టిన విక్కీ.. ఒకే ఓవర్లో అరిఫుల్‌ (9), ఫహీమ్‌ (0) వికెట్లు పడగొట్టి బంగ్లాను మరింత కష్టాల్లో నెట్టాడు. ఆ జట్టు ఒక దశలో 56 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే కాసేపు నిలిచిన మెహ్రాబ్‌ (30), జమాన్‌ (16) బంగ్లా స్కోరును వంద పరుగులు దాటించారు.

ఆస్ట్రేలియా ముందంజ

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఆసీస్‌ 119 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కంగారూ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 276 పరుగులు సాధించింది. అనంతరం పాక్‌ 35.1 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌ ముందే సెమీస్‌ చేరాయి.

ఇదీ చూడండి:Manjrekar On Kohli: 'విరాట్‌ని దిగ్గజ కెప్టెన్లతో పోల్చలేం'

Last Updated : Jan 30, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details