బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ను పక్కనబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్‌ను తప్పించి.. ఆ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీనిపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ స్పందిస్తూ.. జట్టు మేనేజ్‌మెంట్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.
"మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను జట్టు నుంచి తొలగించడం నమ్మశక్యంగా లేదు. ఈ సమయంలో నేను చెప్పగలిగే ఒకే ఒక్క మాట ఇది. నేను చాలా తీవ్రమైన పదాలే ఉపయోగించొచ్చు.. కానీ తొలి టెస్టులో మొత్తం 20 వికెట్లకు 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని పక్కనబెట్టడం నాకు అస్సలు నమ్మశక్యంగా అన్పించట్లేదు" అని ఓ మీడియా ఛానల్‌కు కామెంట్రీ చేస్తూ గావస్కర్ వ్యాఖ్యానించాడు. అయితే కుల్‌దీప్ కాకుండా జట్టులో మరో ఇద్దరు స్పిన్నర్లు (అక్షర్ పటేల్, అశ్విన్) ఉన్నారని, వారిలో ఎవరో ఒకరిని తొలగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్‌ను జట్టు నుంచి తప్పించడంపై సోషల్‌మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి.