భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్(Jaydev Unadkat)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సెలెక్టర్ల నుంచి పదే పదే నిరాశే ఎదురవుతోంది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఉనద్కత్.. తనను శ్రీలంక పర్యటన జట్టులో స్థానం దక్కకపోవడంపై సోషల్‌మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
"నా చిన్నతనంలోనే నాకు ఇష్టమైన ఆటను కనుగొన్నాను. ఎంతోమంది గొప్ప క్రికెటర్ల ఆటను చూసి ప్రేరణ పొందాను. ఇన్నేళ్ల తర్వాత ఆ అనుభూతిని తెలుసుకున్నాను. అయితే ఇతరులతో పోలిస్తే నాలో అహంకార భావాజాలం కూడా లేదు. కానీ, నా చిన్నతనంలో ఇతను ఇలాంటి బౌలర్ అని కొన్ని ముద్రలు వేశారు. నా బౌలింగ్ ప్రదర్శనతో క్రమంగా నాపై వేసిన ముద్రలు సమసిపోయాయి. నేను ఆలోచించే తీరూ మారింది. ఎన్నో అవరాధాలను ఎదుర్కొంటూ వచ్చాను. అదే విధంగా క్రికెట్ నా జీవితంలోకి చాలా తెచ్చిపెట్టింది. జాతీయ జట్టులో ఆడే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుంది? నేను ఏ తప్పు చేశాను? అనే ప్రశ్నలు వేస్తూ కూర్చోను. గతంలో నాకు అవకాశాలు వచ్చాయి. భవిష్యత్‌లోనూ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా. అవకాశం కోసం చివరి వరకు పోరాడతాను. ఇలాంటి సమయంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు".