ప్రపంచ క్రికెట్లో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు, 2019 ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు, వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు.. ఎవరు గురించి చెబుతున్నామో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. అవును అతడే రోహిత్ శర్మ. అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక పారితోషికం (రూ.15 కోట్లు) అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. అలాగే బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో ఏ ప్లస్ (రూ.7 కోట్లు) కేటగిరీలోని ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు. కొన్ని ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తున్నాడు. కొన్ని ప్రకటనల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సంబంధించిన అత్యంత విలాసవంతమైన వస్తువుల్లో కొన్నింటి గురించి మీకోసం.
ముంబయిలో విలాసవంతమైన ఇల్లు (రూ.30 కోట్లు)
ముంబయిలోని ప్రఖ్యాతి చెందిన ప్రాంతంలో రోహిత్‌కు 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ఉంది. అహుజా టవర్స్‌లోని 29 ఫ్లోర్లో ఇది ఉంది! ఇతడి ఇంటి నుంచి అరేబియన్ సముద్రం కనిపిస్తూ ఎప్పుడూ ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుందట. ఈ ఇంటిని 2015లో దాదాపు రూ.30కోట్లకు కొనుగోలు చేశాడని తెలుస్తోంది. రోహిత్, అతడి భార్య రితికకు సంబంధించిన ఫొటోల్లో ఈ ఇంటిని చూడొచ్చు. రితికతో ఎంగేజ్మెంట్ అయిన ఏడాదే ఈ ఇంటిని కొనుగోలు చేశాడు హిట్‌మ్యాన్.