తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మంత్రగత్తె అన్నారు.. నాన్న, తమ్ముడు చనిపోయారు.. అయినా అమ్మ ఒంటరి పోరాటం చేసింది' - అర్చనా దేవి అండర్​ 19 వరల్డ్​ కప్​ ప్లేయర్

అండర్​-19 వరల్డ్​కప్​లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల క్రికెట్​ విభాగంలో తొలి వరల్డ్​ కప్​ను ముద్దాడింది టీమ్ఇండియా. ఆ జట్టులో.. అద్భుత ప్రతిభ కనబర్చిన అర్చనా దేవి, సోనమ్​ యాదవ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వీరిద్దరు.. దేశం గర్వించే స్థాయికి చేరుకున్నారు. ఎన్నో కష్టాలకు, అవమానాలకు ఎదురొడ్డి సక్సెస్​ అయ్యారు. మనసు కరిగించే వారి జీవిత గాథలు ఇవే..

Women cricketers Archana Devi, Sonam Yadav family interview with etv bharat
క్రికెటర్స్ అర్చనా దేవి, సోనమ్ యాదవ్

By

Published : Jan 30, 2023, 7:01 PM IST

సాధించాలనే తపన ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పేదరికం ఏమి అడ్డు కాదు అని చాటి చెప్పారు ఈ అమ్మాయిలు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి.. దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొని.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నారు. వారే.. మొట్ట మొదటి సారి అండర్​-19 వరల్డ్​ కప్​ సాధించిన టీమ్​ఇండియా జట్టులో ప్లేయర్లు అర్చనా దేవి, సోనమ్​ యాదవ్​లు. మనసు కరిగించే వారి జీవిత గాథలు ఇవే..

అమ్మ ఒంటరి పోరాటం చేసింది..
తాజాగా ముగిసిన అమ్మాయిల అండర్​-19 వరల్డ్​కప్​లో అల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టింది అర్చనా దేవి. ఈ ఆల్​రౌండర్​ స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాలోని రతై పూర్వ అనే కుగ్రామం. ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అర్చనా దేవి.. ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది. నాలుగేళ్ల వయసులోనే అర్చన, తన తండ్రి శివరాంను కోల్పోయింది. ఆ తర్వాత సోదరుడు పాము కాటుకు గురై చనిపోయాడు. ఇలా కష్టాలు తన కుటుంబాన్ని కోలుకోలేనంతగా కుంగదీశాయి. అయినా ధైర్యం కోల్పోకుండా కష్టాలకు ఎదురు నిలిచింది అర్చన తల్లి సావిత్రి. తన కుమార్తె భవిష్యత్​కో ఒంటరి పోరాటం చేసింది. పొలాల్లో కూలి పనులు చేసి.. ఇంటింటికీ తిరిగి పాలు అమ్మి మరీ కుమార్తె జీవితాన్ని తీర్చిదిద్దింది.

"మా కుటుంబంలో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ తర్వాత జీవించడం చాలా కష్టంగా మారింది. నా భర్తే కుటుంబానికి ప్రధాన పోషకుడిగా ఉండేవాడు. తను చనిపోయాకా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. మాకు ఉన్న కొద్దో గొప్ప ఆస్తులు, డైరీ వ్యాపారంతో జీవనం సాగించాం. వీటి సహాయంతోనే కుటుంబంలోని ముగ్గురుని పోషించగలిగాను"

--సావిత్రి, అర్చనా దేవి తల్లి

తమ్ముడి ఆఖరి కోరిక నెరవేరింది..
చిన్నతనంలో అర్చన తమ్ముడు బుద్ధిమాన్​ సింగ్​తో క్రికెట్​ ఆడుతుండేది. ఓ రోజు ఎప్పటిలాగే క్రికెట్​ ఆడుతుండగా.. అర్చన బంతిని పొదల్లోకి బాదింది. ఆ బంతికోసం వెళ్లిన బుద్ధిమాన్​ను పాము కాటేసింది. చనిపోతూ కూడా.. తన సోదరిని క్రికెట్​ చేయడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పినట్లు సావిత్రి గుర్తుచేసుకుంది.

"ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి. మా బంధువులందరూ నా కూతురు సాధించిన విజయానికి ఎంతో అభినందిస్తున్నారు. మా బంధువులు మమ్మల్ని చూసే దృక్కోణం మారింది. మాతో ప్రవర్తించే విధానం మారింది. ప్రస్తుతం మా ఇల్లు బంధువులతో నిండిపోయింది. ఇంట్లో వారికి వసతి కల్పించడానికి స్థలం సరిపోవడం లేదు"

--సావిత్రి, అర్చనా దేవి తల్లి

మంత్రగత్తె అన్నారు..
అర్చన సోదరుడు పాముకాటుతో చనిపోయాక గ్రామస్థులందరూ సావిత్రిపై మంత్రగత్తె అని ముద్ర వేశారు. తన కుమార్తెను క్రికెటర్​ చేయాలనుకుంటే కూడా వ్యతిరేకించారు. బంధువులు కూడా 'కుమార్తెను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నావు ' అని ఎన్నో మాటలన్నారు. అయివా వాటిని సావిత్రి పట్టించుకోలేదు. కుమార్తెను చదివించడానికి స్థోమత లేక.. తన సొంతూరు రెతైపూర్వకు 345కిమీల దూరంలో ఉన్న మొరదాబాద్​ లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించింది. ఇక్కడే క్రికెటర్​ కావాలన్న అర్చన కోరికకు బీజం పడింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా పాఠశాలలో పీటీ టీచర్​ పూనమ్ గుప్తా.. అర్చన ప్రతిభను గుర్తించారు. ఆమె సహాయంతోనే క్రికెట్‌ ట్రైనింగ్ కోసం కాన్పూర్‌ అకాడమీకి వెళ్లింది అర్చనా దేవి. అక్కడ చదువుకుంటూనే క్రికెట్‌లో శిక్షణ తీసుకుంది. తన ప్రతిభతో 2018లో ఉత్తర ప్రదేశ్ జట్టు ప్లేయర్​గా అరంగేట్రం చేసింది. ఆతర్వాత కోచ్ కపిల్ దేవ్ పాండే శిక్షణలో ఛాలెంజర్స్‌ ట్రోఫీ లాంటి ప్రధాన టోర్నమెంట్లలో గెలిచి సత్తా చాటుకుంది. మొదటగా టీమ్​ఇండియా-ఏ, ఆ తర్వాత భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది అర్చనా దేవి.

డీజే సంబరాల్లో సోనమ్​ యాదవ్​..
సోనమ్​ యాదవ్​ అండర్​-19 ప్రపంచ కప్​లో జట్టులో కీలక పాత్రపోషించింది. ప్రతిష్టాత్మకమైన మెగాటోర్నీని​ గెలిచిన ఈ బౌలర్​.. విజయాన్ని ఫిరోజాబాద్ జిల్లా అంతా జరపుకుంటోంది. ప్రత్యేకంగా తన సొంత గ్రామంలోని ప్రతి వీదిలో డీజేలు పెట్టుకొని ఆనందంతో చిందులేస్తున్నారు. విజయోత్సాహంతో కేరింతలు కొడుతూ, భారత్​ మాతాకి జై అంటూ స్లోగన్స్ మారుమోగిస్తున్నారు.

"నా కూతురి కష్టానికి ఫలితం దక్కింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురుచూస్తున్నాము. తను సాధించిన విజయం గురించి చెప్పడానికి మాటలు సరిపోవని "

-- గుడ్డీ దేవి, సోనమ్​ యాదవ్​ తల్లి

"దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు ముందుగా నా కుమార్తెకు హృదయపూర్వక అభినందనలు. మేము చాలా సంతోషంగా ఉన్నాము."

--ముకేశ్, సోనమ్​ యాదవ్ తండ్రి

అనుకోకుండా ఓ రోజు..
బంతితో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సోనమ్.. క్రికెట్​లోకి అనుకోకుండానే వచ్చింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. సోనమ్ చిన్నతనంలో ఓ రోజు​ తన తండ్రితో కలిసి ఒక గ్రౌండ్​ పక్కన నడుచుకుంటూ వెళ్లింది. అప్పుడే ఆమె ముందు ఓ బంతి వచ్చి ఆగింది. ఆ బంతిని సోనమ్​ మైదానంలోకి విసిరేసింది. ఆమె త్రో వేయడం చూసిన కోచ్​.. మీ అమ్మాయి అద్భుతంగా బంతిని త్రో చేసిందని ఆమె తండ్రికి చెప్పాడు. అనంతరం మీ అమ్మాయికి మంచి భవిష్యత్​ ఉందని, మంచి ప్లేయర్​ అవుతుందని సోమన్​ తండ్రి ముకేశ్​కు చెప్పాడు కోచ్​. అయితే ముకేశ్​ మొదట ఒప్పుకోలేదు. అనంతరం కోచ్​ మాటలపై నమ్మకం ఉంచి క్రికెట్ శిక్షణకు పంపించాడు. ఆ కోచ్​ ఆధ్యర్వంలో శిక్షణ తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది సోనమ్​ యాదవ్.

ABOUT THE AUTHOR

...view details