T20 World Cup: ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ సూపర్ - 12 పోరు చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్‌కు వెళ్లిపోగా.. మరో రెండు బెర్తుల కోసం నాలుగు జట్లు రేసులో నిలిచాయి. అందుకే నవంబర్ 6 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు పండగే పండగ. మరీ ముఖ్యంగా ఆదివారం అంతా రిలాక్స్ అయిపోదామని అనుకొంటే కుదరదండోయ్.. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగేది ఆదివారాలే మరి. పొట్టికప్ ఫైనల్ (నవంబర్ 13న) మ్యాచ్ సహా రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యే మ్యాచ్‌లు (నవంబర్ 6న) జరగబోయేది 'కిక్ సండే'. మరి ఏ జట్లు సెమీస్‌కు వెళ్లాయి..? రెండు బెర్తుల కోసం పోటీ పడుతున్న టీమ్‌లు ఏవి..? వారి పరిస్థితి ఏంటో చూద్దాం..
తాజాగా శ్రీలంకపై విజయం సాధించిన ఇంగ్లాండ్ ఉత్తమ రన్‌రేట్‌తో గ్రూప్ - 1 నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. అంతకుముందే కివీస్ కూడా సెమీస్ బెర్తును ఖరారు చేసుకొన్న తొలి జట్టుగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్ - 2 నుంచి రెండు బెర్తులను దక్కించుకొనే జట్లేవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. మూడు మ్యాచులూ కీలకమైన తరుణంలో కాస్త ముందంజలో నిలిచిన జట్టు భారత్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్, జింబాబ్వేకి అవకాశాలు లేవు. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల స్థానంలో ఉండటం గమనార్హం. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు దక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్, ఉదయం 9.30 గంటలకు పాకిస్థాన్ X బంగ్లాదేశ్, మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ X జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత్ X జింబాబ్వే మ్యాచ్..
టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లతో గ్రూప్ -2లో అగ్రస్థానం దక్కించుకొంది. చివరి మ్యాచ్ మనదే కాబట్టి గెలిచే అవసరం ఉందా..? లేదా..? అనేది అప్పటికే తేలిపోతుంది. అయితే జింబాబ్వేపై విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా రద్దు అయినా మనకు ఎలాంటి ఢోకా లేదు. అప్పుడు భారత్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ తమ చివరి మ్యాచుల్లో విజయం సాధించినా ఒక సెమీస్ బెర్తు మాత్రం మనదవుతుంది. టీ20 ఫార్మాట్ అంటేనే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే జింబాబ్వే చేతిలో టీమ్‌ఇండియా ఓడితే మాత్రం.. ఇబ్బందులు తప్పవు.