టీమ్‌ఇండియా యువ పేసర్ నవ్‌దీప్ సైని ఆదివారం ట్విటర్‌లో ఓ వీడియో స్టంట్ పోస్టు చేసి నెటిజెన్ల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను షేర్ చేశాడు. 'భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి' అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టుకు నెటిజెన్లు మిశ్రమంగా స్పందించారు. ఆ స్టంట్ చూసిన కొందరు నవ్‌దీప్‌ను మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు.
"ఒక క్రికెటర్ అయ్యుండి ఇలాగేనా చేసేది? ముందు బౌలింగ్ మీద దృష్టి పెట్టు. ఇలాంటి వాటితో ఒరిగేదేం లేదు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం కష్టపడాలి. సచిన్, వినోద్ కాంబ్లీ.. ఇద్దరూ నైపుణ్యమున్న ఆటగాళ్లే. కానీ చివరికి ఎవరెలా ఉన్నారో నీకు తెలుసు కదా. హీరోలా ఎక్కువ చేయకు. నువ్వు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైనా ఈ వీడియోను చూడండి. ఇలా చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?" అని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.