Transgenders Ban In Womens Cricket : అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మార్పులకు ఐసీసీ శ్రీకారం చూడుతోంది. పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతనం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మహిళల క్రికెట్ న్యాయబద్ధతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. అబ్బాయిలు లింగ మార్పిడి ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారి, గుర్తింపు పొందినప్పటికీ మహిళల క్రికెట్ (అంతర్జాతీయ)లో ఆడకుండా వారిపై నిషేధం విధించింది.
అయితే ప్లేయర్ల భద్రత కోసమే మంగళవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్పింది. ఈ క్రమంలో '9 నెలల పాటు విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిబంధన తీసుకొచ్చాం' అని ఐసీసీ సీఈవో అలర్డైస్ తెలిపారు. అయితే డొమెస్టిక్ క్రికెట్ లీగ్‌ల్లో మాత్రం ఈ నిబంధనపై తుది నిర్ణయం ఆయా దేశాలదేనని స్పష్టం చేశారు.
తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్..కెనడాకు చెందిన డానియల్ మెక్‌గహే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆడిన తొలి ట్రాన్స్‌జెండర్. ఆమె ఇదే ఏడాది సెప్టెంబర్‌లో తొలి మ్యాచ్ ఆడింది. 2024 టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో మక్గహే కెనడా తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈ లీగ్‌లో ఆమె 6 మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేసింది. ఇక ఐసీసీ తాజా నిబంధన పట్ల మక్గహే విచారం వ్యక్త పరిచింది. ' ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో నా గుండె బరువెక్కింది. ఇక నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. నా జర్నీలో మద్దతుగా నిలిచిన టీమ్మేట్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని మెక్‌గహే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.