Top Foreign Players In IPL Auction 2024 :ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరిగే వేలంలో, ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్‌ను దక్కించుకుంటుందో అని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. అయితే ఈసారి వేలంలో టాప్ 10లో నిలవనున్న ఫారిన్ ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.
- మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) : దాదాపు 5 సీజన్ల తర్వాత మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. చివరిసారిగా స్టార్క్ 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రూ. 9.4 కోట్లకు అమ్మడయ్యాడు. కానీ, వెన్నుగాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్లోనూ ఆడలేదు. ఇక రీసెంట్గా ముగిసిమ వరల్డ్‌కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన స్టార్క్, ఈ వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం ఈసారి వేలంలో భారీ ధర దక్కించుకునే ఛాన్స్‌లు ఉన్నాయి. అతడు ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2022లో కమిన్స్ కోల్‌కతా తరఫున ఆడాడు. గతంలో రూ. 7.5 కోట్లు పలికిన కమిన్స్ ఈ వేలంలో ఎంత మేరకు ప్రభావం చూపుతాడో వేచి చూడాలి.
- ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) : ట్రావిస్ హెడ్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, జట్ల తరఫున ఆడాడు. కానీ, ఐపీఎల్లో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయితే 2023 వరల్డ్‌కప్‌లో మాత్రం అదరగొట్టిన హెడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానున్న వేలంలో హెడ్ భారీ ధరకు అమ్మడవ్వచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) : న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఈ వేలంలో హాట్ ప్లేయర్‌గా మారాడనడంలో సందేహం లేదు. తాజా ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు మిచెల్. పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం ఉన్న మిచెల్ కోసం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడే అవకాశం ఉంది.
- రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్): న్యూజిలాండ్ యంగ్ టాలెంటెడ్ రచిన్ రవీంద్రకు ఈ వేలంలో డిమాండ్ బాగా ఉండనుంది. తాజా వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన రచిన్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేయగలగడం అతడికి ప్లస్ పాయింట్. ఇక 2023 వరల్డ్‌కప్‌లో 578 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
- జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) : ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకోవడం వల్ల వేలంలోకి వచ్చాడు. కచ్చితమైన యార్లర్లు, బౌన్స్ రాబట్టడంలో హేజిల్‌వుడ్ స్పెషలిస్ట్. ఈ ఆసీస్ పేసర్‌ను ఏ జట్టు దక్కించుకుంటుందో చూడాలి.
- ఆదిల్ రషీద్ ( ఇంగ్లాండ్ ) : ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీ20ల్లో చెప్పుకోదగ్గ ఆటగాడు. గతంలో పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రషీద్, ఈసారి ఏ ఫ్రాంచైజీలో చెరతాడో చూడాలి. బౌలింగ్‌తో పాటు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించగల సత్తా రషీద్‌కు ఉంది.
- హ్యారీ బ్రూక్ ( ఇంగ్లాండ్ ) : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ, గత సీజన్లో బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన బ్రూక్, తర్వాత తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. దీంతో హైదరాబాద్ బ్రూక్‌ను వదులుకుంది. అయితే ఈసారి బ్రూక్ అంత ధర పలకకపోవచ్చు.
- డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్ ) : డేవిడ్ మలన్ టీ20ల్లో డాషింగ్ బ్యాటర్‌గా పేరొందాడు. క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టించగల మలన్‌ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి. ఇంగ్లాండ్ తరఫున పలు అంతర్జాతీయ టోర్నీలు ఆడిన మలన్ ఈ వేలంలో ఎంత మేరకు ప్రభావం కనబరుస్తాడనేది ఆసక్తిగా మారింది.
- జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) : వరుస గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్, ఈ వేలంలో ఇంట్రెస్టింగ్ ప్లేయర్‌గా మారాడు. 2022 అతడ్ని ముంబయి ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా 2022 సీజన్లో ఆడని ఆర్చర్, గత ఐపీఎల్లో బరిలో దిగాడు. అయితే అతడు పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల ముంబయి అతడిని వదులుకుంది.