క్రికెట్లో కవర్ డ్రైవ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ షాట్‌ను అందరూ ఆడలేరు. కొంతమంది మాత్రమే ఈ షాట్‌ను పర్ఫెక్ట్గా ఆడగలరు. ఒకప్పుడు సచిన్ తెందుల్కర్, ఇప్పడు విరాట్ కోహ్లీ ఇలా కొందరు క్రికెటర్లు ఆ షాట్ ఆడితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. వారి బ్యాట్ నుంచి జాలువారే ఆ షాట్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాగ కవర్ డ్రైవ్‌ను ఈ తరంలో చూడముచ్చటగా ఆడే క్రికెటర్లు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ (భారత్)
ప్రస్తుత తరం క్రికెటర్లలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) అంత చక్కగా కవర్ డ్రైవ్‌ను ఎవరూ ఆడలేరని చెప్పవచ్చు. బ్యాట్, శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ బంతిని ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీ దాటించే తీరు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ షాట్‌ను ఆడేటపుడు కోహ్లీ ఫుట్‌వర్క్ అద్భుతమని ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు మెచ్చుకున్నారు. తన కెరీర్లో ఈ కవర్ డ్రైవ్ ద్వారా కోహ్లీ 74.14 సగటుతో 18.8 శాతం పరుగుల్ని సాధించాడు. ఈ షాట్ ఆడేపుడు కోహ్లీ కంట్రోల్ పర్సంటేజ్ 86.3గా ఉంది. అందుకే ఇతడిని ఉత్తమ కవర్ డ్రైవ్ ఆటగాడిగా చెప్పవచ్చు.
బాబర్ అజామ్ (పాకిస్థాన్)
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు బాబర్ అజామ్(Babar Azam). కొందరు ఇతడిని విరాట్ కోహ్లీతోనూ పోలుస్తుంటారు. అందులో కవర్ డ్రైమ్ ముఖ్యమైంది. అచ్చం కోహ్లీని కాపీ కొట్టినట్లుగా బాబర్ కవర్ డ్రైవ్ ఉంటుంది. అదే రీతీలో శరీరాన్ని సమన్వయం చేసుకంటూ అతడు బాదే డ్రైవ్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అజామ్ తన కెరీర్లో కవర్ డ్రైవ్ ద్వారా 49.3 సగటుతో 21 శాతం పరుగుల్ని సాధించాడు. ఈ షాట్ ఆడేటపుడు ఇతడి కంట్రోల్ పర్సంటేజ్ 91.5 శాతంగా ఉంది.