తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC: అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. రికార్డే! - cricket news

దాదాపు రెండున్నరేళ్ల నుంచి సాగుతున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ బ్యాట్స్​మెన్​కు ధీటుగా పలువురు బౌలర్లు సత్తా చాటారు. వికెట్లు వేటలో తామేం తక్కువ కాదని నిరూపించారు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అశ్విన్.. ఈ టోర్నీలో అరుదైన ఘనత సాధించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఇంతకీ అదేంటి?

World Test Championship
టెస్టు ఛాంపియన్​షిప్ అశ్విన్

By

Published : Jun 9, 2021, 11:37 AM IST

Updated : Jun 9, 2021, 11:51 AM IST

టెస్టు క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో బౌలర్లు వికెట్లు తీయడమూ అంతే ముఖ్యం. ఒక మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్‌ చేస్తేనే ఆ జట్టు విజయం సాధించడానికి మెరుగైన అవకాశాలుంటాయి. ఒకవేళ ఎవరైనా బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే మ్యాచ్‌ను అమాంతం లాగేసుకునే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారిని కట్టడి చేయడం అంత తేలిక కాదు. అయితే, బ్యాట్స్‌మెన్‌ హవా చూపించిన ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పలువురు బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు. వారెవరో.. ఎన్ని వికెట్లు తీశారో.. ఏ మేరకు ప్రభావం చూపారో ఒకసారి తెలుసుకుందాం.

కవ్వించే కమిన్స్‌..

ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ 908 రేటింగ్స్‌తో అందరికన్నా ముందున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తన ఆధిపత్యం చెలాయించాడు. రెండేళ్లుగా 14 టెస్టుల్లో ఆడిన అతడు 28 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 70 వికెట్లు సాధించాడు. ఇందులో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గణంకాలు 5/28 నమోదు చేయగా అత్యుత్తమ మ్యాచ్‌ గణంకాలు 7/69గా నమోదయ్యాయి. కమిన్స్‌ చాలా పొదుపుగానూ బౌలింగ్‌ చేయడం వల్ల ఎకానమీ 2.64, సగటు 21.02గా నమోదైంది. ఇక ఒక్కసారి మాత్రమే ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

ప్యాట్ కమిన్స్

భయపెట్టే బ్రాడ్‌..

ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 792 రేటింగ్స్‌తో ఏడో స్థానంలో కొనసాగుతుండగా గడిచిన రెండేళ్లలో టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీల్లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇందులో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 32 ఇన్నింగ్స్‌ల్లో 69 వికెట్లు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గణంకాలు 6/31 కాగా, అత్యుత్తమ మ్యాచ్‌ గణంకాలు 10/67గా నమోదు చేశాడు. ఈ క్రమంలోనే పొదుపుగా బౌలింగ్‌ చేసి 2.77 ఎకానమీతో 20.08 సగటు సాధించాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు ఒకసారి మ్యాచ్‌ మొత్తంగా పది వికెట్లు సాధించాడు.

స్టువర్ట్ బ్రాడ్

రింగులు తిప్పే రవిచంద్రన్‌..

టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 850 రేటింగ్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్న అతడు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఒక మెట్టు తక్కువలో ఉన్నాడు. ఈ రెండేళ్లలో 13 మ్యాచ్‌లు ఆడగా 24 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 67 వికెట్లు పడగొట్టాడు. దాంతో మేటి బౌలర్లకు ఏమాత్రం తీసిపోనని అశ్విన్‌ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో ఇంకో నాలుగు వికెట్లు సాధిస్తే ఈ జాబితాలో కమిన్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గణంకాలు 7/145 కాగా, అత్యుత్తమ మ్యాచ్‌ గణంకాలు 9/207గా నమోదయ్యాయి. ఎకానమీ 2.66 కాగా, సగటు 20.88గా నమోదైంది. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.

రవిచంద్రన్ అశ్విన్

గర్జించే లైయన్‌..

ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ తర్వాతి స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 668 రేటింగ్స్‌తో 19వ స్థానంలో కొనసాగుతున్న అతడు ఈ జాబితాలో నాలుగో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. లైయన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 27 ఇన్నింగ్స్‌ల్లో 56 వికెట్లు తీశాడు. ఇందులో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గణంకాలు 6/49 కాగా, అత్యుత్తమ మ్యాచ్‌ గణంకాలు 10/118గా నమోదయ్యాయి. ఇక పొదుపుగా బౌలింగ్‌ చేసి 2.78 ఎకానమీతో 31.37 సగటు సాధించాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు ఒకసారి మ్యాచ్‌ మొత్తంగా పది వికెట్లు తీశాడు.

లైయన్

స్వింగింగ్‌ చేసే సౌథీ..

ఇక న్యూజిలాండ్‌ ప్రధాన పేసర్‌ టిమ్‌సౌథీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 811 రేటింగ్స్‌తో ఆరో స్థానంలో నిలిచిన అతడు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 10 మ్యాచ్‌లు ఆడి 20 ఇన్నింగ్స్‌ల్లో 51 వికెట్లు సాధించాడు. దాంతో ఈ జాబితాలో ఐదో అత్యుత్తమ బౌలర్‌గా తన ఆధిపత్యం చెలాయించాడు. ఇందులో సౌథీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గణాంకాలు 5/32 కాగా, అత్యుత్తమ మ్యాచ్‌ గణంకాలు 9/110గా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ 2.69 ఎకానమీతో 20.66 సగటు సాధించాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

టిమ్ సౌథీ

ఇవీ చదవండి:

Last Updated : Jun 9, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details