Top 5 T20 Run Scorers In India :ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు క్రేజ్ పెరిగిపోయింది. అయితే మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ రానుంది. ఈ టోర్నీ కోసం ఆయా జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా కూడా అదే పనిలో ఉంది. అయితే ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు బాదిన టాప్ - 5 టీమ్ఇండియా బ్యాటర్లెవరో చూద్దాం.
- విరాట్ కోహ్లీ : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా విరాట్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడు 107 ఇన్నింగ్స్‌లో 137.96 స్ట్రైక్ రేట్‌తో 4008 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- రోహిత్ శర్మ: టీ20ల్లో భారత్‌లోనే కాకుండా ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ టీమ్ఇండియా కెప్టెన్ రోహత్ శర్మ. అతడు 140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మే.
- కేఎల్ రాహుల్ : టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పొట్టి క్రికెట్ ఫార్మెట్లోనూ కీలకంగా మారాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న రాహుల్, మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత వికెట్ కీపర్‌గా తన స్థానం సుస్తిరం చేసుకున్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో రాహుల్ 68 ఇన్నింగ్స్‌లో 2265 పరుగులు చేసి, టీమ్ఇండియాలో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
- సూర్యకుమార్ యాదవ్ : టీ20ల్లో అరంగేట్రం చేసిన కొన్నిరోజుల్లోనే ప్రపంచనెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు సూర్యకుమార్. 360 డిగ్రీల ఆటతో గ్రౌండ్లో నలుదిక్కులా బౌండరీలు బాదుతూ టీ20ల్లో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో ఏకంగా 173.37 స్ట్రైక్ రేట్‌తో 1921 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- శిఖర్ ధావన్ : సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ టీ20ల్లో ఎక్కువ పరుగులు బాదిన ఐదో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడు 54 మ్యాచ్‌ల్లో 1759 పరుగులు చేశాడు. ధావన్ 126.36 స్ట్రైక్ రేట్‌తో టీ20ల్లో 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.