క్రికెట్లో అప్పుడప్పుడు సరదా ఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని నవ్వులు తెప్పిస్తే.. మరికొన్ని అయ్యో పాపం అనుకునేలా చేస్తాయి. అందుకు ప్రధాన కారణం దురదృష్టం వెంటాడటమే. తాజాగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో హెన్రీ నికోల్స్ ఇలాగే ఔటయ్యాడు. అతడు ఆడిన షాట్‌కు బంతి వెళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడి బ్యాట్‌కు తగలడంతో అది వెళ్లి నేరుగా ఫీల్డర్ చేతుల్లో పడింది. అలా అనూహ్యరీతిలో ఔటై నిరాశతో వెనుదిరిగాడు. అయితే, ఇంతకుముందు కూడా ఆటలో ఇలాంటి విచిత్రమైన ఔట్‌లు చోటుచేసుకున్నాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ చూద్దాం..
దెబ్బ తగిలించుకోవద్దని మిస్బా..
పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మిస్బాఉల్ హక్ 2007లో భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలి టెస్టులో ఎవరూ ఊహించని రీతిలో ఔటయ్యాడు. దిల్లీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మిస్బా (82) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా పాయింట్ దిశగా షాట్ ఆడి సింగిల్ కోసం పరుగెత్తాడు. వెంటనే స్పందించిన దినేశ్ కార్తీక్ బంతిని నాన్‌స్ట్రైకర్ వికెట్లవైపు విసిరాడు. అయితే, మిస్బా క్రీజు సమీపంలోకి రాగానే ఆ బంతి తనకు తగులుతుందేమోనని భావించి గాలిలోకి ఎగురుతూ క్రీజులో అడుగుపెట్టాడు. అంతలోపే బంతి వికెట్లకు తాకి నిరాశతో వెనుదిరిగాడు.
బంతి వికెట్లకు తాకుతుందని గూచ్..
ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రహమ్ గూచ్ 1990ల్లో మేటి ఆటగాడు. అయితే, 1993లో ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంతిని చేతితో పక్కకు నెట్టి ఔటయ్యాడు. 511 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన గూచ్ (133) గొప్పగా పోరాడాడు. ఆ సమయంలో హ్యూస్ బౌలింగ్‌లో గూచ్ ఒక బంతిని డిఫెన్స్ చేయగా అది క్రీజులోనే స్టెప్ తీసుకొని వికెట్ల మీదకు పడేలా అనిపించింది. దీంతో వెంటనే స్పందించిన ఇంగ్లిష్ బ్యాటర్ ఆ బంతిని తన చేతితో పక్కకు పడేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు.
త్రోను అడ్డుకొని ఇంజమామ్..
2006లో టీమ్‌ఇండియా పాక్ పర్యటనలో పెషావర్‌లో తొలి వన్డే ఆడింది. భారత్ 329 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించగా పాకిస్థాన్ ఛేదనకు దిగింది. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఇంజమామ్ 16 పరుగుల వద్ద ఉండగా శ్రీశాంత్ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లోకి బంతిని కొట్టి క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా బంతిని అందుకొని వికెట్లకేసి విసిరాడు. అయితే, అప్పటికే క్రీజు బయట ఉన్న ఇంజమామ్ ఆ బంతిని బ్యాట్‌తో అడ్డుకున్నాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్లు మాట్లాడుకొని ఫీల్డింగ్‌కు అడ్డుపడ్డాడనే కారణంతో ఔటిచ్చారు.