IPL Balls per Six: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచుతోంది. ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మూడేసి విజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో వరుసగా టాప్‌లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో కింది నుంచి వరుసగా ఉన్నాయి. అయితే.. ఐపీఎల్ అంటే హార్డ్హిట్టర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. సిక్సర్లతో మ్యాచ్‌లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు రాహుల్ తెవాతియా.
ఆఖర్లో వచ్చి సిక్స్‌లతో టీమ్‌కు భారీ స్కోరు అందించిన వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మంచి ఫినిషర్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, రసెల్, పొలార్డ్, డివిలియర్స్ ముందువరుసలో ఉంటారు. అయితే.. తక్కువ బంతులు వ్యవధిలో, సిక్సర్లు ఎక్కువగా బాదిన వారిలో విండీస్ హార్డ్‌హిట్టర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ టాప్‌లో ఉన్నాడు. ఇతడు సగటున ప్రతి 7 బంతులకో సిక్సర్ బాదాడు. స్ట్రైక్ రేట్ 180 కావడం విశేషం. ఐపీఎల్లో 73 ఇన్నింగ్స్‌లాడి 1806 రన్స్ చేశాడు. ఐపీఎల్లో కనీసం 500 బంతులు ఎదుర్కొన్న వారిలో ఇలా తక్కువ బంతుల వ్యవధిలో సిక్సర్లు బాదిన వారిలో టాప్-10లో భారత బ్యాటర్ ఒక హార్దిక్ పాండ్య మాత్రమే. పాండ్య.. సగటున ప్రతి 10 బంతులకు ఒకదాన్ని స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇతడు మొత్తం 87 ఇన్నింగ్స్‌ల్లో 1540 పరుగులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టైక్ రేట్ 150కి పైనే. ప్రతి 9 బంతులకో సిక్స్‌తో గేల్ 2, 10 బంతులకో సిక్స్‌తో పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే..