Tim paine Border gavaskar: టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌పైన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2020-2021 బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో పలువురు భారత ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించి సిరీస్ మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేలా చేశారని మండిపడ్డాడు. ఆ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ డాక్యుమెంటరీ సిరీస్ రూపొందుతున్న నేపథ్యంలో పైన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అసలేం జరిగిదంటే.. ఆ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్‌మన్‌గిల్, పృథ్వీ షా, నవ్‌దీప్ సైని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారని, అక్కడ వారిని కలిసినట్లు, వాళ్ల బిల్ కూడా కట్టినట్లు ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. అయితే, తర్వాత అతడు టీమ్‌ఇండియా ఆటగాళ్లు తనకు దూరంగా ఉన్నారని మాట మార్చాడు.. దీంతో ఆస్ట్రేలియా మీడియా ఆ విషయాన్ని పెద్దది చేస్తూ భారత ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, బీసీసీఐ వారిపై చర్యలకు ఉపక్రమించిందని రాసుకొచ్చాయి. అయితే, బీసీసీఐ వాటిని కొట్టిపారేసింది.