Tilak Varma World Cup 2023 :2023 ప్రపంచ కప్‌నకు బీసీసీఐ భారత్ జట్టును ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల వన్డేల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు.. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. మెగాటోర్నీకి ఎంపిక చేసిన జట్టులో తిలక్‌కు సెలక్టర్లు మొండిచెయ్యి చూపారు. దీంతో తిలక్ ప్రపంచకప్ ఆశలు ఆవిరైనట్టేనని భావించారంతా. కానీ ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించుకునేందుకు అతడికి మరో అవకాశం ఉంది అదెలాగంటే..
వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్‌లో మార్పులు చేసుకోవడానికి అన్ని జట్లకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అయితే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. గాయం నుంచి తాజాగా కోలుకున్న అతడు.. రీసెంట్గా ఆసియా కప్ భారత్ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగి.. త్వరగానే పెవిలియన్ చేరాడు. తర్వాత అదే టోర్నీలో అయ్యర్ మళ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని తెలిసింది. అయినప్పటికీ అతడికి ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టులో స్థానం దక్కింది. ఈ క్రమంలోనే తిలక్‌ను కూడా ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేశారు.
అయితే కంగారులతో సిరీస్‌కు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కిందంటే.. అతణ్ని మెగాటోర్నీలో ఆడించడంపై మేనేజ్మెంట్ సన్నాహాలు చేస్తుందని భావించవచ్చు. ప్రపంచకప్‌నకు మరో రెండు వారాలే సమయం మిగిలి ఉండడం వల్ల.. అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా అన్న అనుమానం పలువురిలో నెలకొంది. ఒకవేళ ఫిట్నెస్ విషయంలో ఓకే అయినా.. టోర్నీ మధ్యలో ఏదైనా సమస్య తలెత్తదన్న గ్యారెంటీ లేదు.