Tilak Varma T20 Career First 50 : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు హైదరబాద్ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ అదరగొట్టేశారు. రెండు టీ20ల్లోనూ భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా తిలక్ నిలవడం గమనార్హం.
మొదటి టీ20 మ్యాచ్‌లో 39 పరుగులు సాధించిన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్‌లో కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ (51) మార్క్‌ను తాకాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్ 0ఓడిపోయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లు మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తన తొలి హాఫ్ సెంచరీని కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దీనికిగల కారణం ఏంటో కూడా వెల్లడించాడు.
"రోహిత్ శర్మ - రితికా దంపతుల కుమార్తె సమైరాకి నా తొలి అర్ధశతకం అంకితం చేస్తున్నా. ముంబయి జట్టుతో ఐపీఎల్‌లో ఆడుతున్న సమయంలో సమైరాతో అనుబంధం ఏర్పడింది. అంతర్జాతీయ కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని అంకితం ఇస్తానని తనకు ప్రామిస్ చేశా. ఇప్పుడు సంబరాలను ఆమెతో చేసుకుంటా"
-- తిలక్ వర్మ, టీమ్ఇండియా యంగ్ క్రికెటర్
అతి తక్కువ వయసులో హాఫ్ సెంచరీ..
Tilak Varma Record : కాగా, రెండో టీ20లో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయసులో హాఫ్ సెంచరీ రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. రోహిత్ శర్మ ఈ ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో సాధించాడు. దీంతోపాటు టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తిలక్ అధిగమించాడు. పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి స్ధానంలో ఉన్నాడు. రోహిత్ ఈ అరుదైన ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో నమోదు చేశాడు.
రెండో టీ20లోనూ ఓటమి
IND VS WI T20 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో టీమ్ఇండియా వరుసగా రెండో ఓటమి చవి చూసింది. గయనా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య మూడు వికెట్లు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
'ఆ ఫోన్ కాల్ ఊహించనిది.. నిద్రలో కూడా అదే ఆలోచన'
IND Vs WI : అరంగేట్రంలోనే 'హైదరాబాదీ' అదుర్స్.. తొలి 3 బంతుల్లోనే 2 సిక్స్‌లు.. వీడియో చూశారా?