'తానొకటి తలిస్తే.. దైవమొకటి తలుస్తుంది' అనేది తెలుగు నానుడి. కొంతమంది జీవితాలకు అది ఇట్టే సరిపోతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రణ్దీవ్ (Suraj Randiv). ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఫర్వాలేదనిపించిన సూరజ్.. ప్రస్తుతం ఇల్లు గడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
2011 ప్రపంచకప్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు సూరజ్. కానీ, ప్రస్తుతం తన ఇల్లు గడవడానికి ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టీమ్ఇండియాతో జరిగిన ఫైనల్ పోరులోనూ ఈ ఆఫ్‌బ్రేక్ బౌలర్ ఆడాడు. లంక తరఫున 12 టెస్టుల్లో 43, 31 వన్డేల్లో 36, 7 టీ20ల్లో 7 వికెట్ల చొప్పున తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనే కాకుండా వన్డేల్లోనూ ఒకసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.