భారత్‌పై గెలవాలంటే పాకిస్థాన్(T20 2007 World Cup Final) జట్టుకు 13 పరుగులు కావాలి. ఉన్నది ఒకటే ఓవర్, ఒకటే వికెట్. క్రీజులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్. అనామక బౌలర్ జోగిందర్ శర్మకు కెప్టెన్ ధోనీ బంతి అందించాడు. రెండో బంతికే మిస్బా సిక్స్ కొట్టడం వల్ల టీమ్ఇండియా శిబిరంలో ఆందోళన. మరుసటి బంతిని షార్ట్ లెగ్ దిశగా స్కూప్ చేశాడు మిస్బా. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. సరిగ్గా ఇది జరిగి శుక్రవారానికి(సెప్టెంబరు 24) 14 ఏళ్లు.
భారత జట్టు ప్రయాణం..
దక్షిణాఫ్రికాలో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం ఎదుర్కొవడం వల్ల సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు లేకుండానే, టోర్నీలో బరిలోకి దిగింది ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా.