తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబుల్​ సెంచరీ సమీపంలో డిక్లేర్డ్‌.. మూడో బ్యాటర్‌గా ఖవాజా.. సచిన్‌కూ చేదు అనుభవం! - sachin tendulkar missed double century

మరో ఆరు పరుగులు చేస్తే డబుల్‌ సెంచరీ మైలురాయి ఖాతాలో పడే అవకాశం ఉంది. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నిర్ణయం తీసుకోవడంతో ద్విశతకం చేజార్చుకొన్న మూడో బ్యాటర్‌గా ఉస్మాన్ ఖవాజా నిలిచిపోయాడు. ఇలాంటి అనుభవమే సచిన్‌ తెందూల్కర్‌కు ఎదురైంది. దాదాపు 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇలా కేవలం మూడుసార్లు మాత్రమే జరిగింది. ఎప్పుడెప్పుడు జరిగాయంటే?

double century missed moments in test cricket
sachin tendulkar missed double century in test cricket

By

Published : Jan 8, 2023, 8:08 AM IST

టెస్టుల్లో డబుల్‌ సెంచరీ సాధిస్తే ఆ క్రికెటర్‌ కెరీర్‌లోనే గొప్ప ఘనతగా మారుతుంది. అయితే అలా ద్విశతకం బాదే అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం బ్యాటర్‌కు మరిచిపోలేని బాధ కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఇలా డబుల్‌ సెంచరీకి కాస్త దూరంలో ఉండగా, ఆ జట్టు సారథి ప్యాట్‌ కమిన్స్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇలాంటి అనుభవమే భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు ఎదురైంది. దాదాపు 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇలా కేవలం మూడుసార్లు మాత్రమే జరిగింది. ఎప్పుడెప్పుడు చోటు చేసుకుందో.. ఓ సారి తెలుసుకొందాం..

మొదట.. విండీస్‌ దిగ్గజం
మూడు దశాబ్దాల ముందువరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ టీమ్‌ అంటే మిగతా దేశాలకు హడల్‌. హేమాహేమీ ఆటగాళ్లు ఆ జట్టులో ఉండేవారు. సర్‌ గ్యారీ సోబర్స్‌ సహచరుడైన విండీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ ఫ్రాంక్‌ వారెల్‌ 1960లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 197 పరుగులు వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గెరీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. ఇలా ఒక బ్యాటర్‌ 190+ స్కోరు ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన తొలి జట్టుగా విండీస్‌ అవతరించింది. ఇదే మ్యాచ్‌లో వారెల్‌తో కలిసి మూడో వికెట్‌కు 399 పరుగులను జోడించిన సోబెర్స్‌ (226) డబుల్‌ సెంచరీ చేసి ఔట్‌ కావడం గమనార్హం. కానీ ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

మన క్రికెట్‌ దేవుడికీ తప్పలేదు..
పాకిస్థాన్‌తో ముల్తాన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ భారత్‌ టెస్టు క్రికెట్‌లో చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ఇదే టెస్టులో డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (309) త్రిబుల్‌ సెంచరీ బాదేశాడు. కానీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీసుకొన్న నిర్ణయం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అభిమానులకు విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. సచిన్‌ 194 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసి సంచలన నిర్ణయం తీసుకొన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 161.5 ఓవర్లలో 675 పరుగులు వద్ద యువరాజ్‌ (42) ఔటయ్యాడు. దీంతో వెంటనే పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తూ భారత సారథి ద్రవిడ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. ఇంకో ఆరు పరుగులు చేస్తే డబుల్‌ సెంచరీ సచిన్‌ ఖాతాలో పడేది. సచిన్‌ కూడా దూకుడుగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

మూడో బ్యాటర్ ఖవాజా..
తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఇప్పటి వరకు దాదాపు 190 ఓవర్ల ఆట (దాదాపు 2 రోజులు) మాత్రమే సాధ్యమైంది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఖవాజా (195*), రెన్‌షా (5*) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు తొలి గంటలో వేగంగా పరుగులు సాధించేసి.. దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్‌ అప్పగిద్దామనేది ఆసీస్ ప్రణాళిక.

అయితే ఇవాళ (4వ రోజు) తొలి సెషన్‌ మొత్తం వర్షం కారణంగా వృథా అయింది. దీంతో వెంటనే ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 149/6(59 ఓవర్లు) స్కోరుతో కొనసాగుతోంది. ఇలా ఒక బ్యాటర్‌ 190+ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన మూడో జట్టుగా ఆసీస్‌ నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details