హార్దిక్ పాండ్య నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీమ్‌ఇండియా టీ20 జట్టుకు శుభారంభం దక్కింది. శ్రీలంకతో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో హార్దిక్ సేన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఈ ఆల్‌రౌండర్.. టెస్టు క్రికెట్‌లో తన పునరాగమనంపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
'టెస్టుల్లోకి వచ్చేది అప్పుడే'.. హార్దిక్ ఆసక్తికర సమాధానం! - టెస్ట్ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ
పరిమిత ఓవర్ల క్రికెటలో ఆల్‌రౌండర్, కెప్టెన్‌గా అదరగొడుతున్న హార్దిక్ పాండ్య.. కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 అనంతరం.. దీని గురించి పాండ్యను అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చాడు.
"తెల్ల జెర్సీల్లో మళ్లీ ఎప్పుడు కన్పిస్తానంటే..? ముందు నేను నీలం జెర్సీ(పరిమిత ఓవర్ల ఫార్మాట్)లో పూర్తి స్థాయిగా ఆడాలి. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి పెడతా" అని పాండ్య తెలిపాడు. అనంతరం కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఒడుదొడుకుల గురించి స్పందిస్తూ.. "నాకు ఆట కోసం శ్రమించడం మాత్రమే తెలుసు. ఓ దశలో నేను పతనం అంచుల వరకూ వెళ్లినా.. కష్టపడే గుణమే మళ్లీ నన్ను పైకి తెచ్చింది. నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మరింత కష్టపడటంపై దృష్టిపెట్టా. ఇక ఆటలో గాయాలు సహజమే. వాటి వల్ల నేనేం మారను. నన్ను ఈ స్థాయికి చేర్చిన కష్టపడేతత్వాన్నే నమ్ముతాను. ఇంకా గొప్పగా ఆడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను" అని వివరించాడు. 2017లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పాండ్య 2018లో చివరి సారిగా టెస్టు క్రికెట్ ఆడాడు. 11 మ్యాచుల్లో 532 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధ శతకాలను నమోదు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.