Virat Kohli Recalls 2011 World Cup: టీమ్ఇండియా 2011 ప్రపంచకప్ గెలుపొంది పదకొండు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా.. అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలను కొనియాడాడు. 2011 ప్రపంచకప్‌లో ప్రతిమ్యాచ్ ఆడిన కోహ్లీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌తో రాణించాడు. ఆరంభ మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై సెంచరీతో అలరించాడు. సచిన్ 9 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఫైనల్లో శ్రీలంక.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ తక్కువ స్కోరుకే వెనుదిరుగుతారు. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్.. గంభీర్‌తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. మూడో వికెట్‌కు విలువైన 81 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసి కోహ్లీ ఔటవుతాడు. గంభీర్ 97 పరుగులతో ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. ధోనీ(91), యువరాజ్ సింగ్(21*) లాంఛనాన్ని పూర్తి చేసి భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్‌ను అందించారు. కోట్లాది భారతీయుల కల నెరవేరిన రోజు అది.
ఫైనల్లో ఆ 35 పరుగులే:ఫైనల్లో తాను చేసిన 35 పరుగులు.. తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని కోహ్లీ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. అదే తనకు అత్యంత విలువైందని అన్నాడు. సచిన్ భారత క్రికెట్‌కు చేసిన సేవలు వెలకట్టలేనివని, అతడిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నా.. అది చాలా దూరంలో ఉందని అన్నాడు. క్రికెట్ ఆడే రోజుల్లో.. సచిన్‌పై ఎన్నో అంచనాలు ఉండేవని, ఆ ఒత్తిడిని భరించి గొప్పగా రాణించడం అతడికే చెల్లిందని చెప్పాడు.