Surya Kumar Yadav: మిస్టర్ 360 త్వరలో భారత టెస్టు జట్టులో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌పై 'గాడ్‌మోడ్'లో ఆడిన 111 పరుగుల ఇన్నింగ్స్ అనంతరం అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రంపై స్పందించాడు. ''కెరీర్ ఆరంభించిందే ఎర్రబంతి క్రికెట్ (టెస్టులు)తో. నా ముంబయి జట్టు కోసం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాను. టెస్టు క్రికెట్‌పై నాకు మంచి అవగాహన ఉంది. ఆ ఫార్మాట్ ఆడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. త్వరలోనే టీమ్ ఇండియా టెస్టు క్రికెట్ క్యాప్‌ను అందుకొంటానని ఆశిస్తున్నాను'' అని సూర్యకుమార్ తన మనసులోని మాట చెప్పాడు.
గతాన్ని గుర్తుంచుకొంటాను..
బాగా ఆడిన సమయంలో కూడా టీమ్ ఇండియా నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశకు గురైన సందర్భాలను తాను మర్చిపోనని సూర్యకుమార్ వెల్లడించాడు. '' నా గతాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే ముందుకెళ్తాను. నేను ఒక్కడినే ఉన్నా.. నా భార్యతో ప్రయాణిస్తున్నా.. రెండు మూడేళ్ల క్రితం పరిస్థితి ఏంటి.. ప్రస్తుత పరిస్థతి ఏమిటని చర్చించుకుంటాం. అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో మాట్లాడుకుంటాం. అప్పట్లో కొంత నిరాశ ఉండేది. కానీ, దానిలో కూడా ఏదో ఒక ఆశాకిరణం వెతికే వాళ్లం. మరింత మెరుగైన క్రికెటర్‌గా ఎలా మారగలను అని ఆలోచించేవాణ్ని. ఆ తర్వాత కొంత భిన్నంగా ప్రయత్నించాను. సరైన ఆహారం, నాణ్యమైన సాధన, మంచి నిద్ర వంటివి వాటిల్లో ఉన్నాయి. ఆ ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాను. బాగా ఆడినా.. ఆడకపోయినా.. నేను మ్యాచ్ పూర్తయ్యాక.. హైలైట్స్ చూస్తాను. ఆ సమయంలో కొన్ని సార్లు నా షాట్లను చూసి నేనే ఆశ్చర్యపోతాను''
అతిగా ఆలోచించను..
''మ్యాచ్‌ను మించి నేను ఆలోచించను. ఒక వేళ ఆటకు అవసరమైనదాని కంటే.. బౌలర్ల కంటే ఎక్కువగా ఆలోచిస్తే.. ప్లానింగ్ తప్పుదారి పడుతుంది. అందుకే వాస్తవిక పరిస్థితుల్లోనే ఉంటాను. అతిగా ఆలోచించను. బాగా ఆడిన సమయంలో అనుసరించిన రోజువారీ విధానాలను, సాధనను ఎప్పుడూ కొనసాగించాలని నేను అనుకుంటాను. 99శాతం అదే చేయడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు నేను జిమ్ చేస్తాను. సరైన సమయానికి భోజనం ముగిస్తాను. 15-20 నిమిషాలు కునుకు తీస్తాను. ఇవి చిన్న చిన్న విషయాలే. కానీ, మ్యాచ్ ఉన్న రోజుల్లో కూడా నేను ఇవే చేయడానికి యత్నిస్తాను. మైదానంలోకి వచ్చేటప్పటికి ఉత్సాహంగా ఉంటాను''