WPL 2023 : తన రెండేళ్ల కూమార్తెను వదిలిపెట్టి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు రెడీ అయింది తెలుగు తేజం స్నేహ దీప్తి. తనను వదలి భారంగా ముందుకెళ్తున్న అమ్మను బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని దీప్తి తెలిపింది. ఇలాంటి సమయంలో తన కుమార్తెను విచిడిపెట్టి ఉండటం కష్టమేనని.. కానీ తప్పడం లేదని స్నేహ దీప్తి భావోద్వేగానికి గురైంది. క్రీవాను జాగ్రత్తగా చూసుకుంటానని తాను బయల్దేరే ముందు తన భర్త మాటిచ్చాడని దీప్తి చెప్పింది. కాగా, ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో 26 ఏళ్ల స్నేహ దీప్తిని దిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్ పోస్టు చేసిన ఓ వీడియోలో దీప్తి మాట్లాడింది. ''ఈ సమయంలో క్రివాకు దూరంగా ఉండడం చాలా కష్టం. కానీ నా భర్త మాటిచ్చాడు. 'నువ్వు వెళ్లు, నేను క్రివాను చూసుకుంటా' అని చెప్పాడు. హోటల్ చేరిన వెంటనే ఆయనకు ఫోన్ చేశా. అప్పుడు క్రివా నవ్వుతూ మాట్లాడింది. 'బాగా ఆడు' అని చెప్పింది'' అని స్నేహ దీప్తి తెలిపింది. 2021 ఫిబ్రవరిలో కుమార్తెకు జన్మనిచ్చిన దీప్తి.. తిరిగి సెప్టెంబర్‌లో డొమెస్టిక్ క్రికెట్ ఆడింది.
'' నేను ముంబయిలో దిల్లీ జట్టు ఉన్న హోటల్‌కు వచ్చే సమయంలో క్రివా ఏడ్చింది. అప్పుడు వెళ్లాలా? వద్దా? అనే సందేహం కలిగింది. క్రికెట్, కుటుంబం రెండూ నాకు ముఖ్యమే. కానీ కెరీర్ కూడా ఎంతో ముఖ్యమైంది. ఇంత దూరం వచ్చా. కాబట్టి ఇక వెనుకడుగు వేయొద్దని నిర్ణయించుకున్నా. టీమ్‌తో చేరాలని నిర్ణయించుకున్నా. పూర్తిస్థాయిలో నా ఆటను ఆస్వాదించాలి. ఇది నాకో మంచి ఛాన్స్. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శనతో విజయవంతమవ్వాలి. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నేను సాధించగా లేనిది.. మిగతావాళ్లు ఎందుకు చేయలేరు? అనేలా స్ఫూర్తి నింపాలనుకుంటున్నా''