Teja Nidamanuru Netherlands : రానున్న వన్డే ప్రపంచకప్‌లో ఎన్నో చిన్న జట్లు తలపడుతున్నాయి. అందులో నెదర్లాండ్స్ ఒకటి. ఇక ప్రపంచకప్‌లో ఆ జట్టు తరఫున ఆడనున్న ప్లేయర్ల లిస్ట్ చూస్తే.. అందులో మ్యాక్స్ ఒడౌడ్, బాస్ డిలీడ్, స్కాట్ ఎడ్వర్డ్స్, ఆకర్‌మ్యాన్.. ఇలా అన్నీ ఆ దేశానికి తగ్గ పేర్లే కనిపిస్తాయి. అయితే అందులో ఓ పేరు మాత్రం మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పేరే.. తేజ నిడమానూరు. చూస్తుంటే ఇదేదో తెలుగు పేరులా ఉందే.. ఇతను మనవాడేనా అని మనకు సందేహం కలగచ్చు. అవును నిజమే.. అతను మన తెలుగు కుర్రాడే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తన మూలాలు ఉన్నాయి. అయితే చిన్న వయసు నుంచి అతను భారత్‌లో లేడు. విజయవాడలో పుట్టి.. న్యూజిలాండ్‌లో పెరిగి పెద్దవాడైన తేజ.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే తేజ జర్నీలో కొన్ని ఆసక్తికర మలుపులున్నాయి.
Teja Nidamanuru Birth Place : విజయవాడకు చెందిన తేజ చిన్నతనంలోనే తండ్రికి దూరమయ్యాడు. దీంతో ఉద్యోగ రీత్యా తల్లి అతణ్ని తీసుకుని న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఆమె డయాలసిస్ టెక్నీషియన్‌గా పని చేస్తూ.. కొడుకును చదివించారు. అయితే తేజ స్కూలింగ్ పూర్తి చేసే సమయానికి కొన్ని ఇబ్బందుల వల్ల తల్లి విజయవాడకు తిరిగొచ్చేశారు. అప్పటికి తేజ వయసు 16 ఏళ్లు. అయితే తల్లితో పాటు అతను ఇక్కడికి రాలేదు. ఒక్కడే ఆక్లాండ్‌లో ఉండిపోయి.. అక్కడే ఓ అద్దె గదిలో ఉంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ సొంతంగా చదువుకున్నాడు. అలా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌లో డిగ్రీలు పూర్తి చేయడమే కాకుండా ప్రొఫెషనల్ క్రికెటర్‌గానూ సత్తా చాటాడు.
మరోవైపు న్యూజిలాండ్ లిస్ట్-ఎ క్రికెట్లో కూడా అతను ఆడాడు. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో సభ్యులైన ఫిలిప్స్, చాప్‌మన్ లాంటి క్రికెటర్లతో కలిసి తేజ వివిధ వయసు విభాగాల మ్యాచ్‌లు ఆడాడు. అయితే న్యూజిలాండ్ క్రికెట్లో ఓ స్థాయికి మించి అతను ఎదగలేకపోయాడు. బోర్డు కాంట్రాక్టును కూడా సంపాదించలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో నెదర్లాండ్స్‌లో ఒక క్లబ్ టోర్నీ ఆడే అవకాశం తేజకు లభించింది. దీంతో కొన్ని రోజులు మ్యాచ్‌లు ఆడి తిరిగి ఆక్లాండ్‌కు వెళ్లిపోవాలన్నది తేజ ఆలోచన. అయితే అతడితో మ్యాచ్ ఆడిన ఓ వ్యక్తి ఓ కంపెనీకి సీఈవో కాగా.. మాటల మధ్యలో తన విద్యార్హతల గురించి చెప్పడం వల్ల ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ చేశాడు.