wtc points table 2023 : డబ్ల్యూటీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(2023 - 2025) మూడో సీజన్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీమ్‌ఇండియాకు.. వరుణుడి రూపంలో ఓ అడ్డంకి ఎదురైంది. దీంతో క్రికెట్ అభిమానులు వరుణుడా ఎంత పనిచేశావయ్యా అంటూ కామెంట్లు అంటున్నారు.
ఇదీ జరిగింది.. వెస్టిండీస్-టీమ్‌ఇండియా మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో భారత్ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. అయితే మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియాకు.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం చేజారింది. ఐదో రోజు ఆటకు సిద్ధమైన వేళ.. వర్షం రావడం వల్ల మనోళ్లకు క్లీన్‌స్వీప్ చేసే అవకాశం పోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ముందుకెళ్లలేకపోయింది. రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Teamindia wtc points table : ప్రస్తుతం టీమ్‌ఇండియా.. రెండు టెస్టుల్లో ఒక విజయం, ఒక డ్రాతో 16 పాయింట్లు సాధించింది. కానీ పర్సంటేజీలో మాత్రం 66.67 శాతంతోనే కొనసాగుతోంది. ఇక ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకతో మొదటి టెస్టులో ఘన విజయాన్ని సాధించిన పాకిస్థాన్ జట్టు.. 12 పాయింట్లు సాధించి 100 పర్సంటేజీతో అందరికన్నా ముందుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది.
ఇక యాషెస్ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టుల్లో ఆడిన ఆస్ట్రేలియా 54.17 శాతం, ఇంగ్లాండ్ 29.17 శాతంతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ సిరీస్ ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ జులై 27న లండన్ వేదికగా జరగాల్సి ఉంది.