తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలిచిన కోహ్లీ, రహానె- భారత్ 146/3

సౌథాంప్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్​ అజింక్య రహానె క్రీజులో నిలిచారు. కివీస్​ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్​ తలో వికెట్ తీసుకున్నారు.

wtc final, virat kohli
డబ్ల్యూటీసీ ఫైనల్, విరాట్ కోహ్లీ

By

Published : Jun 19, 2021, 10:49 PM IST

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కోహ్లీ, రహానె క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్​ తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల కోహ్లీసేన పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.

శుభారంభం..

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్-గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్​కు 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్నట్లు అనిపించిన ఈ జోడీని జేమీసన్​ విడదీశాడు. ఓ ఊరించే బంతితో రోహిత్​ (68 బంతుల్లో 34 పరుగులు)ను బోల్తా కొట్టించాడు. స్లిప్స్​లో సౌథీకి చిక్కాడు. మరో పరుగు తేడాతో యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్(64 బంతుల్లో 28 పరుగులు)​ కూడా పెవిలియన్ చేరాడు. వాగ్నర్​ బౌలింగ్​లో కీపర్​ క్యాచ్​గా వెనుదిరిగాడు. వన్​డౌన్​ బ్యాట్స్​మన్​గా క్రీజులోకి వచ్చిన టీమ్ఇండియా నయావాల్​.. కొద్ది సేపు కివీస్ బౌలర్లను ప్రతిఘటించాడు. ఏకంగా 54 బంతులు ఆడి కేవలం 8 పరుగులే చేసిన పుజారాను ట్రెంట్ బౌల్ట్​ ఓ చక్కని బంతితో ఎల్బీగా వెనక్కి పంపాడు.

ఆదుకున్న కెప్టెన్-వైస్ కెప్టెన్..

62 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతున్న కోహ్లీ సేన మరి కొద్ది సేపటికే 88కే టాప్-3 బ్యాట్స్​మెన్​ను కోల్పోయింది. ఇక కష్టాలు తప్పవనుకున్న స్థితిలో కెప్టెన్​కు తోడుగా వైస్​ కెప్టెన్​ నిలిచాడు. కోహ్లీ (124 బంతుల్లో 44)తో కలిసిన రహానె(79 బంతుల్లో 29 పరుగులు) నాలుగో వికెట్​కు 58 రన్స్​ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టును కాస్త పటిష్ఠ స్థితికి చేర్చారు. దుర్భేద్యమైన డిఫెన్స్​కు ప్రాధాన్యమిచ్చారు. వీలైనప్పుడల్లా సింగిల్స్​, డబుల్స్​తో తీస్తూ పరుగులు జోడించారు.

కోహ్లీ@7500..

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ మ్యాచ్​ ద్వారా మరి కొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్​గా అత్యధిక టెస్ట్​ల్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన తొలి సారథిగా సరికొత్త ఫీట్ సాధించాడు. ఇంతకు ముందు మాజీ కెప్టెన్​ ధోనీతో సమానంగా 60 టెస్ట్​ల్లో భారత్​కు సారథ్యం వహించాడు విరాట్. తాజా మ్యాచ్​తో కోహ్లీ 61 మ్యాచ్​ల్లో భారత్​ను ముందుండి నడిపించినట్లైంది. అత్యధిక టెస్ట్​ కెప్టెన్లుగా ఉన్న జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ అందరికంటే ముందంజలో ఉన్నాడు.

ఈ మ్యాచ్​కు ముందు 7500 పరుగులు చేయడానికి మరో 10 పరుగుల దూరంలో ఉన్నాడు కోహ్లీ. ఈ మ్యాచ్​లో ఇప్పటివరకు 44 పరుగులతో అజేయంగా నిలిచాడు విరాట్. దీంతో సుదీర్ఘ ఫార్మాట్​లో 7500 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో క్రికెటర్​గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న తొమ్మిదో బ్యాట్స్​మన్​. మొత్తంగా 42వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్​ల్లో ఈ ఘనత అందుకోవడానికి సునీల్​ గావస్కర్​తో సమానంగా కోహ్లీకి కూడా 154 ఇన్నింగ్స్​లే అవసరమయ్యాయి. వీరికంటే ముందు సచిన్​ 144 ఇన్నింగ్స్​ల్లో ఈ ఫీట్​ను అందుకున్నాడు.

వెలుతురులేమీ..

డబ్ల్యూటీసీ మ్యాచ్​కు​ ప్రారంభం నుంచి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోయింది. ఇక సాఫీగా జరుగుతుందనుకున్న రెండో రోజూ వెలుతురులేమీ కారణంగా మ్యాచ్​ పలుమార్లు ఆగిపోయింది. మబ్బులు దట్టంగా పట్టడం వల్ల ఫ్లడ్​లైట్ల వెలుతురు సరిపోలేదు. దీంతో మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు కేవలం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది.

నల్లని రిబ్బన్లతో..

భారత దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ మృతికి సంతాపం ప్రకటించింది టీమ్ఇండియా. మ్యాచ్​ సందర్భంగా భారత ఆటగాళ్లు నల్లని బ్యాండ్​ను చేతులకు ధరించి ఆటలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:WTC Final: కెప్టెన్​గా కోహ్లీ.. ఆటగాడిగా రోహిత్ రికార్డులు

ABOUT THE AUTHOR

...view details