Teamindia vs South Africa: టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ఓమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్‌ను నిర్వహించాలని సీఎస్ఏ ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో కొత్త నిర్ణయం కూడా తీసుకుంది. ఒకవేళ సిరీస్ మధ్యలో ఆటగాళ్లు లేదా ఇతర సహాయక సిబ్బంది ఒమిక్రాన్ బారిన పడినా సిరీస్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు సీఎస్‌ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా. పాజిటివ్ బాధితులను లేదా వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా బలవంతంగా ఐసోలేషన్లోకి పంపబోమని తెలిపారు. ఈ విషయమై ఇరు దేశాల బోర్డులు పరస్పర అంగీకారం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, 3 టెస్టులు, 3 వన్డే మ్యాచుల కోసం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
"భారత ఆటగాళ్లకు ఇప్పటికే కరోనా బూస్టర్ డోసులు అందించాం. ఏ కారణంగానైనా ఆటగాళ్లు అనారోగ్యం పాలైతే తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఓ ఆస్పత్రిలో బెడ్లను ఏర్పాటు చేశాం. ఒకవేళ మ్యాచ్ జరుగనున్న వేదికల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే ఆటగాళ్లను వెంటనే ఇండియాకు పంపిస్తామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒకవేళ ఆటగాళ్లు ఇక్కడే ఉంటామన్నా అందుకు తగ్గ సౌకర్యాలు కల్పిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకున్నా అందుకు అనుమతిస్తాం." అని సీఎస్‌ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా వెల్లడించారు.