తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ప్రపంచకప్పే లక్ష్యంగా బీసీసీఐ పక్కా స్కెచ్​​.. కివీస్​తో తొలి టీ20లో వారికి ఛాన్స్​! - టీమ్​ఇండియా న్యూజిలాండ్ టీ20 సిరీస్​

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెనుదిరిగిన టీమ్​ఇండియా మరో పొట్టి సిరీస్‌ కోసం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20లో తలపడనుంది. సీనియర్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లకు ఇది పరీక్షగా నిలవనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌నకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్న బీసీసీఐ తొలి బంతి నుంచే చెలరేగిపోయే విధ్వంసకర ఆటగాళ్ల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగనున్న టీమ్​ఇండియాపై అందరి దృష్టి నెలకొంది.

Etv Bharat
ఆ ప్రపంచకప్పే లక్ష్యంగా బీసీసీఐ పక్కా స్కెచ్

By

Published : Nov 17, 2022, 6:31 PM IST

వచ్చే టీ20 ప్రపంచకప్‌ నాటికి భారత జట్టును పటిష్టం చేయాలన్న సంకల్పంతో ఉన్న బీసీసీఐ కుర్రాళ్లతో కూడిన జట్టును న్యూజిలాండ్‌కు పంపింది. 2024 పొట్టి ప్రపంచకప్‌ నాటికి కుర్రాళ్లతో కూడిన జట్టును బలంగా చేయాలని భారత్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్​ రాహుల్‌లను.. క్రమంగా టీ20 ఫార్మాట్‌ నుంచి పక్కనపెట్టి కొత్తవారికి అవకాశాలివ్వాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆటతీరుకు భిన్నంగా తొలిబంతి నుంచి దూకుడుగా ఆడే వారిని ప్రోత్సహించి పవర్‌ప్లేలో పరుగులు రాబట్టాలని భావిస్తోంది.

గతేడాది యూఏఈలో జరిగిన టీ20ప్రపంచకప్‌ ఓటమి తర్వాత దూకుడు విధానాన్ని పవర్‌ప్లే ఓవర్లలో అవలంభించాలని భావించినా ఆస్ట్రేలియాలో అది అమలు చేయడంలో టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. టీ20 ప్రపంచకప్‌నకు మరో రెండేళ్ల సమయం ఉన్నందున ఇంగ్లాండ్‌ మాదిరి అన్ని విభాగాల్లో విధ్వంసం సృష్టించగల ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దే అవకాశం బీసీసీఐకి ఉంది. ఇందులో భాగంగానే రోహిత్‌ గైర్హాజరీలో జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. 2024 టీ20 ప్రపంచకప్‌నకు హార్దిక్‌ సారథ్యంలోనే టీమ్​ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.

కివీస్‌తో 3 టీ20ల సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగే అవకాశం ఉంది. రిషబ్‌ పంత్‌ను కూడా ఓపెనింగ్‌కు ప్రత్నామ్యాయంగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ప్రస్తుత సిరీస్‌లో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగినా వారందరికీ అంతర్జాతీయంగా ఆడిన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్‌ గడ్డపై జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో... రాణించిన శుభ్‌మన్‌ గిల్‌... తన టీ20 అరంగేట్రం ఇక్కడే చేయనున్నాడు. తరచూ జట్టులోకి వచ్చి వెళ్తున్న ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌... తమ స్థానాలు పదిలం చేసుకునేందుకు సరైన సమయం దొరికింది. గాయాలతో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ బ్యాటు, బంతి రెండింటితో రాణించాలని భావిస్తున్నాడు. టీ- ట్వంటీల్లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోవడం భారత్‌ను కలవరపెడుతోంది. ఇటీవలి ప్రపంచకప్‌లో ఆడని కుల్దీప్‌-చాహల్‌ ద్వయం..... ఈ సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. బు‌మ్రాకు తోడు మరో ఫాస్ట్‌ బౌలర్‌ భారత్‌కు అవసరం. ఆ స్థానానికి ఉమ్రన్‌ మాలిక్‌ ఉన్నప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లాండ్​ పర్యటనల్లో అంచనాలను అందుకోలేకపోయాడు. ఉమ్రన్ మాలిక్ బౌలింగ్‌లో వేగం ఉన్నప్పటికీ... మరింత కచ్చితత్వంపై దృష్టిసారించాలి. ప్రపంచకప్‌లో లాగే భువనేశ్వర్‌తోపాటు అర్షదీప్‌ సింగ్‌... కొత్త బంతిని పంచుకోనున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన హర్షల్ పటేల్‌కు కూడా తుదిజట్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక కేన్‌ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్‌ పూర్తిస్థాయి జట్టుతో భారత్‌ను ఢీకొట్టనుంది. భారత్‌ లాగానే... ప్రపంచకప్‌ నాకౌట్‌లో వెనుదిరిగిన కేన్‌ సేన... ఈ సిరీస్‌ చేజిక్కించుకుని బలంగా పుంజుకోవాలని యోచిస్తోంది. ట్రెంట్ బౌల్ట్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన విలియమ్సన్‌.. ఈ సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:బీచ్​లో సిక్స్​ప్యాక్‌ బాడీలతో టీమ్​ఇండియా క్రికెటర్లు.. వీడియో వైరల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details