న్యూజిలాండ్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలివన్డేలో ఓటమి చవిచూసిన భారత జట్టు హమిల్టన్ వేదికగా జరిగే రెండో వన్డే కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని కోరుకుంటోంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలివన్డేలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఓపెనర్లు శిఖర్‌ధావన్, శుభమన్ గిల్ అర్థశతకాలతో సత్తా చాటి మరోసారి శతక భాగస్వామ్యం అందించినప్పటికీ పవర్‌ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించలేకపోయారు. తొలి పది ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే భారత్ చేయగలిగింది. చిన్న మైదానమైన ఈడెన్ పార్క్‌లో 306 పరుగులు చేసినా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివర్లలో వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే 300 పరుగుల మార్క్‌ను కూడా టీమిండియా దాటేదికాదు. ఈ నేపథ్యంలో ఆది నుంచి దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని భారత బ్యాటర్లు కోరుకుంటున్నారు.
ముఖ్యంగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ భారత జట్టును వేధిస్తోంది. వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న వేళ రిషబ్ పంత్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండో వన్డేలో లాథమ్, కేన్ విలియమన్స్ సహా కివీస్ బ్యాటర్లను వారు కట్టడి చేయాల్సి ఉంది. రెండో వన్డేకు చాహల్ స్థానంలో కులదీప్‌ను ఆడించే అవకాశాలనూ తోసిపుచ్చలేము. హమిల్టన్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.