తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుజారా, శ్రేయస్​ సూపర్ ఇన్నింగ్స్​​​.. చివర్లో ఎదురుదెబ్బ.. తొలి రోజు స్కోరు.. - బంగ్లాదేశ్​ తొలి టెస్టు పంత్ రికార్డు

బంగ్లాదేశ్​తో జరిగిన మొదటి టెస్టు తొలి రోజు ముగిసే సరికి టీమ్​ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఆ వివరాలు..

Teamindia vs Bangladesh first test first day innings
బంగ్లాదేశ్​ టీమ్​ఇండియా తొలి రోజు టెస్టు

By

Published : Dec 14, 2022, 4:19 PM IST

Updated : Dec 14, 2022, 4:38 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన మొదటి టెస్టు తొలి రోజు ముగిసే సరికి టీమ్​ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఆరంభంలోనే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన భారత్‌.. తర్వాత పుంజుకొని గౌరవప్రదమైన స్కోరు సాధించే దిశగా ముందుకెళ్లింది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. చివర్లో ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా.. శతకానికి చేరువగా వచ్చిన పుజారా (90) ఔటయ్యాడు. పంత్​(46) మంచి ఇన్నింగ్స్​ ఆడారు.

ఆట సాగిందిలా.. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్‌ గిల్ (20)తో పాటు విరాట్ కోహ్లీ (1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. తొలి వికెట్‌కు రాహుల్‌-గిల్ 41 పరుగులు జోడించారు. అయితే ఖలిద్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ కాగా.. గిల్, కోహ్లీ తైజుల్ ఇస్లామ్‌కి దొరికిపోయారు. దీంతో 21 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

దూకుడుగా పంత్​.. 48 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయిన భారత్‌ను రిషభ్‌ పంత్ , ఛెతేశ్వర్ పుజారా ఆదుకున్నారు. వీరిద్దరూ లంచ్​ బ్రేక్​ ముందే.. నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. దీంతో భోజన విరామం పూర్తయ్యే సరికి టీమ్‌ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

లంచ్​ తర్వాత ఎదురుదెబ్బ.. కానీ లంచ్ తర్వాత భారత్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. క్రీజ్‌లో కుదురుకొని అర్ధశతకం దిశగా సాగిన రిషభ్‌ పంత్ (46) దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడు. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ బౌలింగ్‌లో (31.4వ ఓవర్) బంతిని వికెట్ల మీదకు ఆడి బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. పుజారాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అలా టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 56 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇక టీ బ్రేక్​ తర్వాత కూడా వీరిద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 140 పరుగులను జోడించారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల తర్వాత మూడంకెల స్కోరును సాధిస్తాడని భావించిన ఛెతేశ్వర్‌ పుజారా (90: 203 బంతుల్లో 11 ఫోర్లు) పది పరుగుల దూరంలో పెవిలియన్‌కు చేరాడు. తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన (84.2వ ఓవర్‌) బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్ (79*)తో కలిసి ఐదో వికెట్‌కు నిర్మించిన 149 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి అక్షర్ పటేల్ వచ్చాడు. కానీ ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 90వ ఓవర్‌ చివరి బంతికి అక్షర్ పటేల్ (14) బంగ్లా బౌలర్‌ మెహిదీ హసన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (82*) అజేయంగా నిలిచాడు.

ఇదీ చూడండి:పంత్​ అరుదైన రికార్డు.. కానీ కోహ్లీ అలా చేశాడేంటి?

Last Updated : Dec 14, 2022, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details