టీ20 సిరీస్‌లలో భాగంగా తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమ్ఇండియా.. తర్వాత జరిగిన పోరులో ప్రతీకారం తీర్చుకుంది. ఇక చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటర్లు పరుగులు సాధించినా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తొలిమ్యాచ్‌లో టీమ్ఇండియా 209 పరుగులు చేసి కూడా ఓటమిపాలు కావటం జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను ఎత్తిచూపింది. అక్షర్ పటేల్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం రోహిత్ సేనకు సానుకూలాంశంగా ఉంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్ల రెండో మ్యాచ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అటు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్, స్పిన్నర్ చాహల్ బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు. ఈ సిరీస్‌లో 6 ఓవర్లకు 81 పరుగులిచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. బుమ్రా అందుబాటులోకి రావడం భారత్‌కు కొంతకలిసొచ్చే అంశంగా మారింది. బ్యాటింగ్‌లో రోహిత్, రాహుల్, కోహ్లీ రాణించాలని, చివరిమ్యాచ్‌లోనూ సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తిక్ మెరుపులు మెరిపించాలని యాజమాన్యం భావిస్తోంది.