శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ సేన సిద్ధమైంది. ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత జట్టు.... మంగళవారం లంకతో తొలి వన్డే ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా మారింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని భావించినా..గాయం కారణంగా దూరం కావడంతో భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్, టీ ట్వంటీ ప్రపంచకప్‌నకు దూరమైన బుమ్రా జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనకైనా అందుబాటులో ఉంటాడా ఉండడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదని మాజీలు అంచనా వేస్తున్నారు. మరో 10 నెలల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న దృష్ట్యా జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. ఓపెనర్‌గా. రోహిత్‌కు తోడుగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దానికి యువకుడు శుభ్‌మాన్ గిల్‌తో నేరుగా ఘర్షణ పడవచ్చు. తర్వాత కోహ్లీ.. శ్రేయస్స్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.... కేఎల్ రాహుల్‌లతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. టీ ట్వంటీల్లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్ యాదవ్... వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. వన్డేల్లో 16 మ్యాచ్‌లు ఆడిన సూర్య రెండు అర్ధ సెంచరీలతో కేవలం 384 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌నకు ముందు వన్డేల్లో తన సత్తా చాటాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.